Begin typing your search above and press return to search.

కేటీఆర్ బర్త్ డే వేళ వైరల్ గా మారిన రామోజీ లేఖ.. నిజమెంత?

By:  Tupaki Desk   |   24 July 2021 10:30 AM GMT
కేటీఆర్ బర్త్ డే వేళ వైరల్ గా మారిన రామోజీ లేఖ.. నిజమెంత?
X
కాలగర్భంలో సంవత్సరం కరిగిపోయేసరికి.. కొందరి పుట్టిన రోజులకు ఎక్కడ లేని ప్రాధాన్యత లభిస్తుంటుంది. వారి పుట్టిన రోజును గతానికి మించి ఘనంగా జరిపేందుకు పడే తాపత్రయం అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటుంది. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజకీయ రంగంలో ఈ హడావుడి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఒక నేత స్థాయిని అతడి పుట్టిన రోజును అతడి పరివారం చేసే హడావుడితో లెక్కించే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. తమ అభిమాన నేత వీరుడు.. శూరుడు.. అంటూ తనివితీరా పొగిడేయటానికి ఇంతకు మించిన మంచి వేదిక మరేం ఉంటుందన్న భావన ఈ మధ్యన తెలుగు ప్రజల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇలాంటి వేళ..కొందరి పనులు ప్రముఖులకు తలనొప్పిగా మారుతుంటాయి. మింగాలేక కక్కాలేక లేని పరిస్థితులు తీసుకొస్తుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా యువనేతకు పుట్టినరోజు శుభాకాంక్షల్ని భారీగా తెలియజేసే ప్రయత్నం చేశారు.

తనను ఎవరూ కలవొద్దని ఆయన స్వయంగా కోరిన నేపథ్యంలో.. తమకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు వీలుగా ఈ రోజు దినపత్రికల్లో భారీగా యాడ్స్ ను ఇచ్చేయటం ద్వారా అందరికి తెలియజేసే ప్రయత్నం చేశారు. మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. ఇంకొందరు రోడ్ల మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మరింత తెలివైన వారు తాము చేసే కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసి.. రామన్నా.. నీ పుట్టిన రోజున నాడు ఇన్ని పనులు చేశాం తెలుసా? అంటూ చెప్పటం కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో రామోజీ సంస్థల అధినేత రామోజీ రావు పేరుతో ఒక లేఖ తాజాగా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారింది. అందులో మంత్రి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రామోజీ రావు సంతకంతో.. ఆయన లెటర్ ప్యాడ్ తో బయటకు వచ్చిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు.

కేటీఆర్ ను సంబోధించిన వైనమే భిన్నంగా ఉంది. 'నవతరం నాయకులు శ్రీ తారక రామారావు' అన్న పిలుపు రామోజీ నోటి నుంచి రావటం అంటే మాటలా? అంతేనా.. ఈ లేఖలోని అంశాలే.. దీన్ని సంచలనంగా మార్చాయి. అందులోని కొన్ని వ్యాక్యాల్ని చూస్తే..

- అరుదైన నాయకత్వ లక్షణాలు.. అసాధారణ సంభాషణ నైపుణ్యం.. అన్నిటినీ మించిన రాజకీయ చతురతతో అనతికాలంలోనే పరిణత నాయకునిగా ఎదిగి తెలంగాణ రాజకీయ యువనికపై వెలుగులీనుతున్న మీకు 45వ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

- ఒక ఉన్నత శ్రేణి నాయకునికి కావాల్సిన లక్షణాలన్నీ మూర్తీభవించిన మీ పని తీరును నేను ఆది నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీరు సాధిస్తున్న పురోగతిని చూసి గర్విస్తున్నాను.
- తన బిడ్డ తండ్రిని మించిన తనయుడు కావాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. మీ వంటి చైతన్య శీలిని పుత్రునిగా పొందిన ఆయన ధన్యులు.
- మీకు సాటి రాగల యువనాయకులు దేశంలోనే లేరనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. దేశానికి మీవంటి నవతరం నాయకులు అవసరం. ఇంతింతై మీరు దేశానికే నాయకత్వం వహించేలా ఎదగాలని ఈ పుట్టినరోజు సందర్భంగా ఆశిస్తూ..'' అంటూ ముగించిన వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఈ లేఖ రియలా? ఫేకా? అన్నదిప్పుడు పెద్ద చర్చగా మారింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ లేఖను రామోజీ కార్యాలయం నుంచి విడుదల కాలేదని చెబుతున్నారు. వారికి అందిన ఈ లేఖను చూసి వారు విస్మయానికి గురి అవుతున్నట్లుగా తెలుస్తోంది. అలా అని ఫేక్ అని కొట్టిపారేయలేరు.. అలా అని నిజమని ఒప్పుకోనూలేదు. ఇలా రామోజీ అండ్ కోను సందిగ్ధావస్థలో పడేయటం ద్వారా ఈ లేఖ ను క్రియేట్ చేసినోడి ప్లాన్ ఫలించిందన్న మాట వినిపిస్తోంది.

చూసినంతనే నిజంగానే రామోజీ పంపారన్నట్లుగా ఉండే ఈ లేఖ ఆయన్ను టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఏ నాయకుడ్ని ఈ రీతిలో పొగడటం రామోజీకి అలవాటు లేదని.. ఈ లేఖ ద్వారా ఆయన్ను ఇబ్బంది పెట్టటమే లక్ష్యమని చెబుతున్నారు. కేటీఆర్ పుట్టిన రోజేమో కానీ.. రామోజీకి కొత్త తిప్పలు ఎదురైనట్లుగా చెబుతున్నారు.