Begin typing your search above and press return to search.

ముంద‌స్తు ప‌క్కానేనా?..కోవింద్ ఆంతర్యం ఇదేనా?

By:  Tupaki Desk   |   29 Jan 2018 10:43 AM GMT
ముంద‌స్తు ప‌క్కానేనా?..కోవింద్ ఆంతర్యం ఇదేనా?
X
2019లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉంది. అయితే ఇప్పుడు ఆ ఎన్నిక‌ల వేడి రాజుకున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మైన సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు జాతీయ వార్తా ప‌త్రిక‌లు - టీవీ ఛానెళ్లు - స‌ర్వే సంస్థ‌లు వేర్వేరుగా - సంయుక్తంగా నిర్వ‌హించిన స‌ర్వేలు - వాటి ఫ‌లితాల‌కు జాతీయ మీడియాతో పాటుగా ప్రాంతీయ మీడియా కూడా ఇస్తున్న ప్రాధాన్య‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మీడియా క‌థ‌నాలు ఎలా ఉన్నా... అటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గానీ.. ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ గానీ పార్టీ ప‌రంగా నిర్వ‌హిస్తున్న స‌మీక్ష‌లు - స‌ద‌రు స‌మీక్ష‌ల్లో చేస్తున్న కామెంట్లు చూసినా... ఆ రెండు పార్టీలు ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల క‌స‌ర‌త్తును మొద‌లెట్టేసిన‌ట్లే క‌నిపిస్తోంది. గ‌త‌వారం వెలువ‌డిన స‌ర్వేల‌న్నీ కూడా మ‌రోమారు మోదీ ప్ర‌ధానిగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని ఘంటాప‌థంగా చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిలా పూర్తి స్థాయి మెజారిటీతో కాకుండా బోటాబోటీ మెజారిటీ - మిత్ర‌ప‌క్షాల బ‌లంపైనే ఆధార‌ప‌డి న‌డిచే ప్ర‌భుత్వాన్నే మోదీ ఏర్పాటు చేసే అవ‌కాశాలున్నాయ‌ని కూడా ఆ స‌ర్వేలు తేల్చి చెప్పాయి. అదే స‌మ‌యంలో గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చిన కాంగ్రెస్ పార్టీ ఈ ద‌ఫా అధికారం చేజిక్కించుకునే స్థాయిలో స‌త్తా చాట‌లేకున్నా... మోదీకి మాత్రం ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం ఖాయ‌మ‌ని కూడా ఆ స‌ర్వేలు తేల్చేశాయి.

ఈ నేప‌థ్యంలో నేటి ఉద‌యం ప్రారంభ‌మైన పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మాశాల్లో భాగంగా ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన రాష్ట్రప‌తి రామ్‌ నాథ్ కోవింద్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. దేశంలో ఎన్నిక‌ల‌న్నీ ఒకే సారి జ‌రిగితే... దేశాభివృద్ధికి ఆటంకం క‌ల‌గ‌ద‌ని - అంతేకాకుండా ఆ విధానం ద్వారా ప్ర‌భుత్వానికి బోలెడు ఖ‌ర్చు ఆదా అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వంతో పాటుగా అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా ఈ దిశ‌గా క‌లిసి అడుగు వేసేందుకు య‌త్నిస్తే బాగుంటుంద‌ని కూడా ఆయ‌న అభిల‌షించారు. అయినా ఈ మాట గ‌తంలో మోదీ నోట విన్న‌దేగా అంటారా? నిజ‌మే.. దేశంలో ఎప్పుడూ ఎక్క‌డో ఒక చోట ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, ఈ త‌ర‌హా ప‌రిస్థితి వ‌ల్ల ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి తీవ్ర విఘాతం క‌లుగుతోంద‌ని మోదీ చాలా సుదీర్ఘ ప్ర‌సంగమే చేశారు. ఈ త‌ర‌హా విప‌త్క‌ర ప‌రిస్థితికి జ‌మిలి ఎన్నిక‌లు ఒక్క‌టే మందు అని కూడా ఆయ‌న చెప్పేశారు. అంటే లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న‌ది మోదీ అబిప్రాయం. ఈ ప్ర‌తిపాద‌న‌కు దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా సానుకూలంగానే స్పందించార‌ని క‌థ‌నాలు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది స‌మ‌యం ఉంద‌న‌గా... సాక్షాత్తు రాష్ట్ర‌ప‌తి నోట పార్ల‌మెంటు సాక్షిగా జ‌మిలి ఎన్నిక‌ల మాట వినిపించిందంటే... మోదీ కూడా ఆ దిశ‌గానే ప‌య‌నిస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

మ‌రి జ‌మిలి ఎన్నిక‌లు జ‌ర‌గాలంటే అన్ని రాష్ట్రాల‌కు చెందిన అసెంబ్లీల‌ను ర‌ద్దు చేయాల్సి ఉంది. ఇలా జ‌ర‌గాలంటే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగానే ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టిస్తే... ఏ ఒక్క రాష్ట్రానికి అభ్యంత‌రం ఉండ‌ద‌న్న భావ‌న వినిపిస్తోంది. ఈ వాద‌న నిజ‌మేన‌న్న కోణంలో ప‌య‌నిస్తున్న మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు ఇప్ప‌టికే త‌మ పార్టీ శ్రేణుల‌ను అప్రమ‌త్తం చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా జ‌మిలి ఎన్నిక‌ల పేరు చెప్పి... మోదీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని, ఈ విష‌యాన్ని త‌న నోటి నుంచి కాకుండా రాజ్యాంగ పెద్ద‌ల‌తోనే చెప్పించేస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రప‌తి హోదాలో రామ్ నాథ్ కోవింద్ త‌న ప్ర‌సంగంలో జ‌మిలి ఎన్నిక‌ల‌ను ప్ర‌స్తావించార‌ని కూడా రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తంగా దేశంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అన్ని ర‌కాల క‌స‌ర‌త్తులు చాలా సైలెంట్‌గానే కాకుండా చాలా స్పీడుగా కూడా అడుగులు ప‌డుతున్నాయ‌న్న మాట‌.