Begin typing your search above and press return to search.

స్వాతిని హత్య చేసింది వాడు కాదంట

By:  Tupaki Desk   |   6 July 2016 10:24 AM GMT
స్వాతిని హత్య చేసింది వాడు కాదంట
X
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసుకు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన రామ్ కుమార్ నిందితుడు కాదని.. మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక అమాయకుడైన గ్రామీణ యువకుడిగా అతడి తరఫు న్యాయవాది వాదించటం ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగినట్లైంది. పోలీసుల అరెస్ట్ సమయంలో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్న వాదనలో నిజం లేదని.. పోలీసులే గొంతు కోసి.. గాయం చేసినట్లుగా రామ్ కుమార్ తరఫు లాయర్ వాదించటం గమనార్హం.

ఒక నిరుపేద యువకుడ్ని దురుద్దేశపూర్వకంగా హంతకుడిగా చిత్రీకరించటం తగదని చెప్పిన అతడి న్యాయవాది.. స్వాతి హంతకుడ్ని రెండు రోజుల్లో పట్టుకోవాలంటూ హైకోర్టు ఆదేశించిన మీదట ఒత్తిడితో పోలీసులు ఈ పని చేసినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. రామ్ కుమార్ పై అబద్ధపు ఆరోపణలు మోపి అరెస్ట్ చేసినట్లుగా పేర్కొంటూరామ్ కుమార్ తరఫు లాయర్ కృష్ణమూర్తి ఒక పిటీషన్ వేశరు.

స్వాతిని హత్య చేసినట్లుగా చెబుతున్న సాక్షి సైతం.. గుర్తు తెలియని యువకుడు కత్తితో దాడి జరిపి హత్య చేసినట్లుగా పోలీసులకు తెలిపారని.. అయితే పోలీసులు అసలైన హంతకుడ్ని వదిలేసి.. అమాయకుడైన రామ్ కుమార్ను అరెస్ట్ చేశారని వాదించారు. రామ్ కుమార్ కు బెయిల్ మంజూరు చేయాలంటూ అతడి తరఫు న్యాయవాది బలంగా వాదిస్తున్న నేపథ్యంలో ఈ కేసుపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.