Begin typing your search above and press return to search.

హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్

By:  Tupaki Desk   |   11 April 2020 4:31 PM GMT
హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్
X
ఏపీ నూతన సీఈసీ గా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ను ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. విజయవాడలో నేడు జస్టిస్ కనగరాజ్ ఏపీ సీఈసీగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన తాజా ఆర్డినెన్స్ నేపథ్యంలో రిటైర్డు ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ తన పదవిని కోల్పోయారు. దీంతో, తనను హఠాత్తుగా పదవి నుంచి తొలగించడం, ఏపీ సీఈసీ పదవీకాలం కుదింపుపై ఏపీ హైకోర్టును నిమ్మగడ్డ రమేష్ ఆశ్రయించినట్లు తెలుస్తోంది. హైకోర్టులో రమేష్....హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ పంచాయతీ రాజ్ చట్టానికి చేసిన సవరణలు తన పదవీ కాలం ముగిసన తర్వాతే అమల్లోకి వస్తాయని రమేష్ పిటిషన్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల హైకోర్టుకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర కేసులు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ పిటిషన్ విచారణ ఎప్పుడు జరుగుందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

నిమ్మగడ్డ రమేష్ పై కక్ష సాధింపు చర్యగానే కొత్త ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇలా తొలగించడం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధమని చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి మోపిదేవి వెంకట రమణ ఖండించారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే నిమ్మగడ్డ రమేష్ నడుచుకుంటున్నారని, చంద్రబాబు డైరెక్షన్ లోనే రమేష్ పనిచేస్తున్నారని మోపిదేవి అన్నారు. చంద్రబాబు సూచనల ప్రకారమే రమేష్ ఎన్నికలను వాయిదా వేయాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఏపీ సీఎస్ - హెల్త్ సెక్రటరీలకు మాట మాత్రం చెప్పకుండా రమేష్ ఎన్నికలను వాయిదా వేయడం ఇందుకు ఉదాహరణ అని అన్నారు. కొన్ని సార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలను కొద్ది గంటల్లోనే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వవలసిన చంద్రబాబు...ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని మోపిదేవి మండిపడ్డారు.