Begin typing your search above and press return to search.

బాహుబలిగా మారుతానంటున్న బాబా రాందేవ్‌

By:  Tupaki Desk   |   6 May 2017 7:52 AM GMT
బాహుబలిగా మారుతానంటున్న బాబా రాందేవ్‌
X
యోగా గురు బాబా రాందేవ్ త‌న సార‌థ్యంలో పతంజలి కంపెనీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రానున్న ఏడాది రెండేండ్ల కాలంలో దేశంలో ని ఎఫ్‌ ఎంసీజీ రంగపు బాహుబలిగా తీర్చిదిద్దనున్నట్టు రాందేవ్ తెలిపారు. 2018 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పతంజలి విక్రయాలను రెండింతలుగా పెంచుకొని రెవెన్యూను రూ.20,000 కోట్లకు చేరువ చేయాలని నిర్ణయించినట్టుగా ఆయన వెల్లడించారు. ఇందుకోసం రానున్న ఏడాది కాలంలో ప్రస్తుతం ఉన్న డిస్ట్రిబ్యుటర్‌ వ్యవస్థను 6000 నుంచి 12,000లకు పెంచనున్నట్టు ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా మరో అయిదు కొత్త ప్లాంటులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఇందుకు రూ.5000 కోట్లను వెచ్చిస్తామని అన్నారు. ఎఫ్‌ ఎంసీజీ రంగంలోని విదేశీ సంస్థ‌ల గుత్తాధిపత్యాన్ని తాము ఛేదించామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న లక్ష మంది ఉద్యోగుల సంఖ్యను తాము 5,00,000లకు చేర్చనున్నట్టుగా బాబా రాందేవ్ వివరించారు.

హరిద్వార్‌ కు చెందిన కంపెనీ సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను ఐదు రెట్లు పెంచుకుంది. దీంతో దేశంలో అతిపెద్ద స్వదేశీ బ్రాండ్‌ గా నిలిచింది. అదే సమయంలో రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో బిజీగా ఉంది. ఇప్పుడు బహుళ జాతీయ ఫుడ్ చైన్ మెక్ డోనాల్డ్‌ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దాంతోపాటు కెఎఫ్‌ సి - సబ్‌ వే రెస్టారెంట్లను కూడా లక్షం గా చేసుకున్నారు. కొత్తగా రెస్టారెంటు వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టి భారతీయ వంటకాలను అందించాలని నిర్ణయించారు. దీని ద్వారా ఆ కంపెనీల వ్యాపారాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెస్టారెంట్ల చైన్ ఓపెన్ చేయాలని పతంజలి గ్రూపు ఆలోచిస్తోందని రాందేవ్ వెల్లడించారు. ఇప్పటికే టూత్ పేస్టు నుంచి రకరకాల ఎఫ్‌ ఎంసిజి ఉత్పత్తులను పతంజలి మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాటికి మంచి ఆదరణ కూడా పొందిన సంస్థ ఇప్పుడు మూలికలు, ప్రత్యేకంగా శరీరానికి మేలుచేసే పదార్థాలతో కూడిన ఆహారాన్ని భారతీయులకు అందించాలని భావిస్తోంది.

పతంజలి బిస్కట్ల లాంటి వాటికి ఇప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు. దాంతో ఇప్పుడు ఫుడ్ రీటైలింగ్‌ లోకి అడుగుపెడితే కచ్చితంగా మిగిలినవాళ్లకు గట్టి పోటీ ఇవ్వగలమని పతంజలి వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో మొత్తం రీటైల్ వ్యాపారంలో 57 శాతం వాటా ఆహార ఉత్పత్తులదే ఉంది. 2025 నాటికి ఈ మార్కెట్ మూడు రెట్లు పెరిగి దాదాపు రూ. 71 లక్షల కోట్లు అవుతుందని అంచనా. డామినోస్ పిజ్జా లాంటి చాలామంది ఈ రంగంలో ఇప్పటికే పాతుకుపోయి ఉన్నారు. అయినా అవసరమైతే ఎంత పెట్టుబడి అయినా పెట్టి మరీ ఆహార వ్యాపారాన్ని కొల్లగొట్టాలన్నది రాందేవ్ వ్యూహంలా కనిపిస్తోందని విశ్లేష‌కులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/