Begin typing your search above and press return to search.

ప్రియాంక వస్తే బీజేపీకి కష్టాలే అంటున్న రాందేవ్

By:  Tupaki Desk   |   23 May 2016 6:50 AM GMT
ప్రియాంక వస్తే బీజేపీకి కష్టాలే అంటున్న రాందేవ్
X
కాంగ్రెస్ పేరెత్తితే విరుచుకుపడే యోగా గురువు రాందేవ్ బాబా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కనుక ప్రియాంకా గాంధీని రంగంలోకి దించితే మంచి మైలేజి వస్తుందని... అప్పుడు బీజేపీకి కష్టాలు మొదలవుతాయని ఆయన జోష్యం చెప్పారు. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే బీజేపీ మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది... లేదంటే ఆమెను అడ్డుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. రాందేవ్ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. నిత్యం తమకు అనుకూలంగా మాట్లాడే బాబా ఒక్కసారిగా వాస్తవాలు మాట్లాడేసరికి బీజేపీ నేతలు అప్రమత్తమవుతున్నారు. అయితే... ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన యథాలాపంగా ఆ మాటలన్నట్లుగా తెలుస్తోంది.

కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. మూడు దశాబ్దాల తర్వాత స్పష్టమైన మెజారిటీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు డబుల్ డిజిట్ కు పడిపోయిన కాంగ్రెస్ పార్టీ బలం ఆ పార్టీకి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అయింది. ప్రస్తుతం మోడీని తట్టుకోగల నేతలు కాంగ్రెస్ లో ఎవరూ కనిపించడం లేదు. సోనియా - రాహుల్ లు కూడా మోడీ ముందు నిలవలేకపోతున్నారు. ఈ దశలో ప్రియాంక రాజకీయ రంగప్రవేశం చేయాలని కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా బలంగా వినిపిస్తోంది. కానీ... సోనియా కుటుంబం నుంచి దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ప్రియాంక కూడా తనకు ఆసక్తి లేదన్నట్లుగానే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని రాందేవ్ బాబాను అడగ్గా ఆయన నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఒక హిందీ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ప్రియాంకా గాంధీ చేపడితే బీజేపీ మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సోనియా - రాహుల్ ల కంటే ప్రియాంక పట్ల ప్రజల్లో ఉన్న అంచనాల నేపథ్యంలోనే ఆయన ఈ కామెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది.