Begin typing your search above and press return to search.

ఏపీలో రాందేవ్ బాబా ‘పతంజలి’

By:  Tupaki Desk   |   14 Sep 2016 4:37 AM GMT
ఏపీలో రాందేవ్ బాబా ‘పతంజలి’
X
విభజన తర్వాత పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఏపీ పరిస్థితి మెరుగు అవ్వాలంటే.. అభివృద్ధి తప్పనిసరి. ఎన్ని ఎక్కువ ప్రాజెక్టులు ఏపీకి వస్తే అంతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విభజన జరిగి.. కొత్తగా ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్ల రెండు నెలలు పూర్తి అయినా ఇప్పటికీ జరిగింది అంతంత మాత్రమే. బాబు సర్కారు అధికారంలోకి వచ్చినంతనే అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరి ఏదేదో జరుగుతుందని భావించిన ప్రజలకు అలాంటిదేమీ కనిపించని పరిస్థితి.

ఇలాంటి నిరాశపూరిత వాతావరణంలో ఆశా రేఖలు అప్పుడప్పడు విచ్చుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఆశలు రేకెత్తే ఒక ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా. కొమ్ములు తిరిగిన ఎఫ్ ఎంజీ కంపెనీలకు వణుకు పుట్టిన ఆయన పతంజలి కంపెనీకి చెందిన ఉత్తత్తి కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయనున్న తీపికబురును తాజాగా ఆయన వెల్లడించారు.

పలు ఉత్పత్తులతో ఇప్పటికే దూసుకెళుతున్న పతంజలి.. తాజాగా దేశ వ్యాప్తంగా ఆరు కొత్త ఉత్పత్తి కేంద్రాల్ని దేశ వ్యాప్తంగా స్టార్ట్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో తాజాగా ఒక ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. మిగిలిన కేంద్రాల్ని మధ్యప్రదేశ్ లోని ఇండోర్.. అసోంలోని గౌహతి.. జమ్మూ కశ్మీర్.. ఉత్తరప్రదేశ్.. ఏపీలలో కొత్త కేంద్రాల్ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఏపీలో నాయుడుపేటలో కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. 200 ఎకరాల్లో తమ తాజా ఉత్పత్తి కేంద్రం ఉంటుందని చెబుతున్న రాందేవ్ బాబా.. పతంజలి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు తమ ఉత్పత్తుల ఉత్పత్తిని రెట్టింపు చేస్తున్నట్లుగా చెప్పారు. నాయుడుపేటలో ఏర్పాటు చేస్తున్న ఉత్పత్తి సంస్థ ద్వారానే దక్షిణాది రాష్ట్రాలకు వస్తు సరఫరా ఉంటుందని వెల్లడించారు.

పతంజలి ఉత్పత్తులపై వస్తున్న పలు ఆరోపణలపై స్పందించిన రాందేవ్ బాబా.. తమ వద్ద 200 మంది సీనియర్ సైంటిస్టులు పని చేస్తున్నారని.. వారి నేతృత్వంలో ప్రతి అంశంలోనూ కచ్ఛితత్వం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పతంజలి ద్వారా నేరుగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నామని.. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచటమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. పరోక్షంగా పతంజలి ట్రస్ట్ ద్వారా 5 కోట్ల మందికి ఉపాధి కల్పించాలన్నదే తన కలగా చెప్పుకొచ్చారు.