Begin typing your search above and press return to search.

బాబా రాందేవ్ సీక్రెట్స్ ఆ పుస్త‌కంలో ఉన్నాయ‌ట‌

By:  Tupaki Desk   |   9 Nov 2017 5:23 AM GMT
బాబా రాందేవ్ సీక్రెట్స్ ఆ పుస్త‌కంలో ఉన్నాయ‌ట‌
X
యోగా గురువుగా ప‌రిచ‌య‌మై.. ఏళ్ల వ్య‌వ‌ధిలో బ‌హుళ జాతి సంస్థ‌ల‌కు సైతం దిమ్మ తిరిగేలా చేసిన ఘ‌నత బాబా రాందేవ్‌ది. యూని లీవ‌ర్స్‌.. కాల్గేట్ లాంటి బ‌హుళ జాతి సంస్థ‌ల‌కు కంగారు పుట్టేలా చేయ‌ట‌మే కాదు.. త‌మ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి రీడిజైన్ చేసుకునేలా చేయ‌టంలో రాందేవ్ ప్ర‌భావం చాలా ఉంది.

ఒక టీవీ ఛాన‌ల్ లో యోగా నేర్పే గురువుగా ప‌రిచ‌య‌మై.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వేలాది కోట్ల రూపాయిల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా మారిన రాందేవ్ జీవితంలోని చీక‌టి కోణాల్ని బ‌య‌ట‌పెడుతూ జ‌ర్న‌లిస్ట్ ప్రియాంక పాఠ‌క్ నారాయ‌ణ్ ఏకంగా ఒక పుస్త‌కాన్నే రాసేశారు.

గాడ్ మ్యాన్ టు టైకూన్ పేరుతో రాసిన పుస్త‌కంలో బాబా రాందేవ్ జీవితంలో ప‌లు చీక‌టి కోణాలు ఉన్నాయ‌ని పేర్కొన‌ట‌మే కాదు.. ఆయ‌న తీరుపై ప‌లు సందేహాల్ని వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు ఈ పుస్త‌కాన్ని నిషేధించాలంటూ రాందేవ్ బాబా ఢిల్లీ కోర్టును ఆశ్ర‌యించి బ్యాన్ ఉత్త‌ర్ర‌వులు తెచ్చుకున్నారు. బాబానే క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిన ఈ పుస్త‌కంలో ఏముంది? అన్న విష‌యంలోకి వెళితే ప్ర‌పంచానికి తెలియ‌ని చాలా విష‌యాలు ఈ పుస్త‌కంలో ఉన్నాయి.

సాదాసీదా యోగాగురువుగా జీవితాన్ని మొద‌లెట్టిన రాందేవ్‌.. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిప‌తి అయ్యే క్ర‌మంలో రాందేవ్ కు అండ‌గా నిలిచిన చాలామంది స‌న్నిహితులు త‌ర్వాతి కాలంలో క‌నిపించ‌లేదంటూ అనుమానాల్ని వ్య‌క్తం చేశారు.

యోగా పాఠాలు నేర్పి.. దివ్య మందిర్ ట్ర‌స్ట్ కి కోట్లాది రూపాయిల విలువైన భూములు ఇచ్చిన స్వామి శంక‌ర్ దేవ్ 2007లో అక‌స్మాత్తుగా అదృశ్య‌మ‌య్యారు. ఈ స‌మ‌యంలో రాందేవ్ విదేశాల్లో ఉన్నారు. త‌న‌కు ప్రాణ స‌మాన‌మైన గురువు అదృశ్య‌మైన విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ రాందేవ్ మాత్రం రాలేదంటూ ఆరోపించారు. రాందేవ్ గురువు అదృశ్యానికి సంబంధించిన కేసు సీబీఐకి అప్ప‌గించినా నేటికీ తేల‌ద‌న్న విష‌యాన్ని ఆమె పేర్కొన్నారు. రాందేవ్‌ కు గురువైన స్వామి శంక‌ర్ దేవ్ తో పాటు.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన స్నేహితుడు స్వామి యోగానంది సైతం అనుమానాస్ప‌ద మ‌ర‌ణాన్ని తాజా పుస్త‌కంలో ప్రియాంక ప్ర‌స్తావించారు.

ఆయుర్వేద వైద్యంలో పేరున్న స్వామి యోగానంది ఇచ్చిన లైసెన్స్ తోనే 1995 నుంచి 2003 వ‌ర‌కు రాందేవ్ మందులు త‌యారు చేశారు. 2003లో కాంట్రాక్టును ర‌ద్దు చేసుకున్న రాందేవ్‌.. త‌ర్వాతి ఏడాదికి యోగానంద్ శ‌వం ర‌క్త‌పు మ‌డుగులో క‌నిపించింద‌న్నారు. రాందేవ్ స్వ‌దేశీ మిష‌న్‌ కు ప్ర‌ణాళిక‌లు ర‌చించిన రాజీవ్ దీక్షిత్ అనే మ‌రో స‌న్నిహితుడు సైతం అనుమానాస్ప‌ద మృతికి గుర‌య్యారు.

గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు చెప్పిన‌ప్ప‌టికీ.. ఒక రోజుకే ఆయ‌న శ‌వం రంగు మార‌టంపై సందేహాన్ని వ్య‌క్తం చేశారు. పోస్ట్ మార్టం చేయాల‌ని రాజీవ్ దీక్షిత్ అనుచ‌రులు డిమాండ్ చేసినా ఫ‌లితం లేక‌పోలేద‌ని పేర్కొన్నారు. ఇలా.. రాందేవ్ మీద సాగిన సందేహాల ప‌రంపర పుస్త‌కంలో చాలా ఉన్నాయి. దీనిపై రాందేవ్ స్పందించి పుస్త‌కాన్ని నిషేధించాల‌ని ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. బాబా పిటిష‌న్ పై స్పందించిన కోర్టు.. ఈ పుస్త‌కం అమ్మ‌కాల‌పై బ్యాన్ విధించింది. అయితే.. ఈ ఉత్త‌ర్వులను పుస్త‌క ర‌చ‌యిత ప్రియాంకా పాఠ‌క్‌.. జుగ్గ‌ర్ నాట్ బుక్స్ న్యాయ‌పోరాటానికి దిగాయి. పుస్త‌క ర‌చ‌యిత‌.. ప‌బ్లిష‌ర్ మాట విన‌కుండా ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై తాము పోరాడ‌తామ‌ని చెబుతున్నారు. రాందేవ్ బాబా పుస్త‌కం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారంద‌న‌టంలో సందేహం లేదు.