Begin typing your search above and press return to search.

మోడీకి మరో వివాదాస్పద నేత దొరికాడు

By:  Tupaki Desk   |   13 July 2016 11:14 AM GMT
మోడీకి మరో వివాదాస్పద నేత దొరికాడు
X
మోడీ కేబినెట్ లోకి కొత్తగా తీసుకున్న మంత్రి రాందాస్ అథవాలే సంచలన ప్రకటన చేశారు. దేశంలోని దళితులకు ఆయుధాలు ఇవ్వాలని అంటున్నారు. ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగానూ చెప్పారు. దేశంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని.. ఆ దాడుల నుంచి రక్షించుకోవడానికి వారికి ఆయుధాలు ఇవ్వాలన్నది ఆయన అభిప్రాయం. అగ్రవర్ణాల వారితో ప్రేమలు - పెళ్లిళ్లు కారణంగా దళితులు వారి నుంచి ముప్పు ఎదుర్కొంటున్నారని.. తరచూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అథవాలే అంటున్నారు. తమ పిల్లల ప్రేమ వివాహాలను జీర్ణించుకోలేని అగ్రవర్ణ తల్లిదండ్రులు దళితులపై దాడులకు దిగుతున్నారని అన్న అథవాలే.. అలాంటి దాడులను ఎదుర్కొంనేందుకు దళితులకు ఆయుధాలివ్వాలని.. దీనిపై హోంశాఖతో చర్చిస్తానని అన్నారు.

కాగా దూకుడు స్వభావిగా పేరున్న అధవాలే కేంద్ర మంత్రివర్గంలో చేరిన కొద్ది రోజులుగా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ పెద్దలు ఖంగు తిన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీలో ఉన్న సాధువులు - ఇతర నోటి దురుసు నేతల వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి తోడు సొంత పార్టీ నేతలపైనే వ్యాఖ్యలు చేసే సుబ్రహ్మణ్య స్వామి ఉండనే ఉన్నారు. వారంతా చాలదన్నట్లుగా ఇప్పుడు అథవాలే కూడా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంపై ఆందోళన చెందుతున్నారట. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను రక్షించాల్సిన.. శాంతిభద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేక ప్రజలు ఎవరికి వారే కాపాడుకోవాలన్నట్లుగా ఆయుధాలివ్వడం ఏంటన్న వాదన వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా ఉంటూ అథవాలే ఆ వ్యాఖ్యలు చేయడంతో అవి ప్రభుత్వ వ్యాఖ్యలుగానే భావించాల్సి ఉంటుంది. పైగా పాశ్చాత్య దేశాల్లా ఈ గన్ కల్చర్ ముదిరితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని.. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి అథవాలే అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా అథవాలే గతంలోనూ ఈ డిమాండ్ చేశారు. అయితే.. అప్పుడు ఆయన ప్రభుత్వంలో లేరు. ఇప్పుడు సామాజిక న్యాయ శాఖకు సహాయ మంత్రి. దళితుల ప్రాణాలను కాపాడేందుకు సామాజిక న్యాయ శాఖ సహాయమంత్రిగా - ఆయుధాలు ఇచ్చే విషయంలో ఆలోచనలు చేస్తున్నట్టు తెలిపారు. అదేదో మామూలుగా కాకుండా హోంశాఖతో చర్చించడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారట. దళితులకు ఆయుధాలు వచ్చేలా తాను గట్టిగా ప్రయత్నిస్తానని మంత్రి చెప్పడం చూస్తుంటే ఆయన ఇక్కడితో ఆగేలా లేరని బీజేపీ నేతలు అంటున్నారు.