Begin typing your search above and press return to search.

సీఎంకు పంచ్ ఇచ్చేలా కేంద్రమంత్రి లాజిక్

By:  Tupaki Desk   |   8 Oct 2016 9:47 AM GMT
సీఎంకు పంచ్ ఇచ్చేలా కేంద్రమంత్రి లాజిక్
X
కొందరు రాజకీయనేతల మాటలు చాలా చిత్రంగా ఉంటాయి. తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేసేందుకు వారు చెప్పే లాజిక్ లు విన్నప్పుడు ముచ్చటేస్తుంది. ప్రత్యర్థుల విధానాల్ని విమర్శించేందుకు.. వారు చేసేది తప్పు అని చెప్పటానికి చెప్పే మాటలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. అలాంటి మాటల్నే తాజాగా చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్. బీహార్ లో కొత్తగా తీసుకొచ్చిన మద్యనిషేధ చట్టంపై తనకున్న ఆగ్రహాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు.

ఈ చట్టంలోని కొన్ని అంశాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మద్యనిషేధంపై బీహార్ సర్కారు నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో.. దానికి చెక్ చెబుతూ సుప్రీంకోర్టు ఊరటనిచ్చేలా నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. మద్యనిషేధ చట్టంలోని లోపాల్ని ఎత్తిచూపుతూ ఆయన కాస్తంత ఎటకారంగా వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఎక్కడైనా మద్యం కనిపిస్తే ఆ కుటుంబంలోని పెద్దలందరిని జైలుకు పంపుతామని కొత్త చట్టంలో ఉందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం కనిపిస్తే.. రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి.. ఆయన్ను జైలుకు పంపాలంటూ వ్యాఖ్యానించారు.

మద్యనిషేధానికి తమ పార్టీ (లోక్ జనశక్తి) అనుకూలమే అయినప్పటికీ.. మద్య నిషేధ చట్టంలోని కొన్ని నిబంధనల మీద ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో మద్యం కనిపిస్తే ఇంటి పెద్దను అరెస్ట్ చేయటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. కొత్త లాజిక్ నితీశ్ సర్కారుకు పెద్ద పంచ్ గా అభివర్ణిస్తున్నారు. రాంవిలాస్ పాశ్వాన్ చేసిన తాజా వ్యాఖ్యలపై నితీశ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/