Begin typing your search above and press return to search.

నాలుగు నెలల్లో అయోధ్యలో రామాలయం

By:  Tupaki Desk   |   16 Dec 2019 4:23 PM IST
నాలుగు నెలల్లో అయోధ్యలో రామాలయం
X
దశాబ్దాలుగా హిందూ ముస్లింల మధ్య గొడవకు కారణమైన బాబ్రీమసీదు-అయోధ్య భూవివాదం ఎట్టకేలకు సమసిపోయింది. ఆ వివాదాస్పద స్థలం రాముడి జన్మస్థలమేనని నిర్ణయించి రామాలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

కాగా బీజేపీ అధ్యక్షుడు - కేంద్రహోంమంత్రి అమిత్ షా తాజాగా సంచలన ప్రకటన చేశారు. మరో నాలుగు నెలల్లోనే అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని ప్రకటించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని.. ఎన్ని ప్రయత్నాలు చేసినా రామాలయం నిర్మించి తీరుతామని అమిత్ షా సవాల్ విసిరారు.

జార్ఖండ్ లోని పాకూర్ లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన అమిత్ షా ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు.. వందేళ్లుగా అయోధ్యలో రాముడు జన్మించిన స్థలంలో ఆలయం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారని.. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఇంకో నాలుగు నెలల్లోనే అయోధ్యలో ఆకాశమంత ఎత్తున రామాలయం నిర్మిస్తామని అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు.

అయోధ్య వివాదంలో ముస్లిం సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్లు అన్నింటిని సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అమిత్ షా ఈ ప్రకటన చేశారు. మరో నాలుగు నెలల్లోనే అయోధ్య రామమందిరాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించి అమిత్ షా సంచలనాలకు తెరలేపారు.