Begin typing your search above and press return to search.

కోవింద్ దృష్టిలో... మైనారిటీలు ఎవ‌రంటే!

By:  Tupaki Desk   |   21 Jun 2017 4:27 AM GMT
కోవింద్ దృష్టిలో... మైనారిటీలు ఎవ‌రంటే!
X
రామ్ నాథ్ కోవింద్‌... నిన్న‌టి దాకా బీహార్ ప్ర‌థ‌మ పౌరుడు. మ‌రికొన్ని రోజుల్లో దేశానికే ప్ర‌థ‌మ పౌరుడిగా ఎన్నిక కాబోతున్నారు. భార‌త రాష్ట్ర‌ప‌తిగా ఆయ‌న ఎన్నిక లాంఛ‌న‌మేన‌ని చెప్పాలి. ఎందుకంటే... కేంద్రంలో అధికార కూటమిగా ఎన్డీఏ ఆయ‌న‌ను రాష్ట్ర‌ప‌తి ఎన్నికల్లో త‌న అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మ‌రునాడే... అంటే నిన్న ఆయ‌న బీహార్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. స‌ద‌రు రాజీనామాకు వెనువెంట‌నే రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ క్ర‌మంలో కోవింద్ వ్య‌క్తిగ‌త విశేషాల‌తో పాటు బీజేపీ నేత‌గా ఆయ‌న ప్ర‌స్థానానికి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. బీజేపీ నేత‌గానే సుదీర్ఘ కాలం ప్ర‌స్థానం కొన‌సాగించిన కోవింద్ అత్యంత సాధార‌ణ జీవితాన్ని గ‌డిపార‌ని అన్ని దేశ వ్యాప్తంగా అన్ని ప‌త్రిక‌లు ప్ర‌త్యేక క‌థ‌నాల‌ను రాస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఓ ప‌త్రిక ఆయ‌న‌కు సంబంధించిన మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం కోవింద్ బీజేపీ నేత‌గా, సౌమ్యుడిగానే కాకుండా కోవింద్‌ ను క‌ర‌డుగ‌ట్టిన హిందూత్వ వాదిగా ముద్ర వేసేసింది. ఇదేదో అదాటుగా ఆ ప‌త్రిక ఈ మాట అన‌లేదండోయ్‌... ఓ ఏడేళ్ల క్రితం కోవింద్ చేసిన ఓ కీల‌క ప్ర‌సంగాన్ని ప్ర‌స్తావిస్తూ ఈ వాద‌న‌ను వినిపించింది. ఆ క‌థ‌నం వివ‌రాల్లోకెళితే... దేశంలోని మైనారిటీ వ‌ర్గాలైన ముస్లింలు - క్రైస్త‌వుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన రంగ‌నాథ్ మిశ్రా క‌మిటీ... 2009లో త‌న నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది. ముస్లింల‌కు 10 శాతం - క్రైస్త‌వుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ఇవ్వాల‌ని, క్రైస్తవులుగా ఉన్న ద‌ళితుల‌ను ఎస్సీలుగానే ప‌రిగ‌ణించాల‌ని ఆ క‌మిటీ ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసింది.

ఈ విష‌యం తెలిసిన కోవింద్‌... 2010 మార్చిలో దీనిపై మాట్లాడేందుకు ఏకంగా మీడియా స‌మావేశాన్నే ఏర్పాటు చేశారు. రంగ‌నాథ్ మిశ్రా క‌మిష‌న్ నివేదిక‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ముస్లింలు - క్రైస్త‌వుల‌ను ఆయ‌న ఏకంగా ప‌రాయి దేశ‌స్తులుగా అభివ‌ర్ణించారు. ప‌రాయి వ‌ర్గాల‌కు చెందిన వారికి రిజ‌ర్వేష‌న్లేమిట‌ని కూడా ఆయ‌న కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ఆర్థికంగానే కాకుండా సామాజిక ప‌రంగానూ అణ‌గారిన వ‌ర్గాలుగా ఉన్న ముస్లింలు, క్రైస్త‌వుల‌కు స‌ర్కారీ కొలువుల్లో రిజ‌ర్వేషన్లు ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని కూడా ఆయ‌న త‌న వాద‌న‌ను గ‌ట్టిగానే వినిపించారు. షెడ్యూల్డ్ కులాల్లో ముస్లింలు - క్రైస్త‌వులు ఉండ‌ట‌మే రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కూడా కోవింద్ గ‌ళ‌మెత్తారు.

ముస్లింలు, క్రైస్త‌వులుగా మారిన దళితులు... ఇత‌ర ద‌ళితుల కంటే కూడా సామాజికంగానే కాకుండా ఆర్థికంగానూ బ‌లంగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. రంగ‌నాథ్ మిశ్రా క‌మిష‌న్ చెప్పిన‌ట్లుగా ముస్లింలు, క్రైస్త‌వుల‌కు 15 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తూ... క్రైస్త‌వులు, ముస్లింలుగా మారిన వారిని ఇక‌పైనా ఎస్సీలుగానే ప‌రిగ‌ణిస్తే... భ‌విష్య‌త్తులో మ‌త‌మార్పిడులు మ‌రింత అధిక‌మ‌వుతాయ‌ని కూడా కోవింద్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వెర‌సి నాడు కోవింద్ త‌న‌లోని హిందూత్వ వాదాన్ని గ‌ట్టిగానే వినిపించార‌ని ఆ ప‌త్రిక క‌థ‌నం వెల్ల‌డించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/