Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ వేదిక‌గా అమిత్‌ షా రామమందిర జ‌పం

By:  Tupaki Desk   |   13 July 2018 4:50 PM GMT
హైద‌రాబాద్ వేదిక‌గా అమిత్‌ షా రామమందిర జ‌పం
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న కొత్త స‌మీక‌ర‌ణాలు తెర‌తీసింది. బీజేపీ పార్టీ నేత‌లు - కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపేలా - వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పార్టీని బ‌లోపేతం చేసేలా ప‌ర్య‌ట‌న సాగింద‌ని ఆ పార్టీ నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తుండ‌గా హైద‌రాబాద్ వేదిక‌గా అమిత్‌షా పాత ఫార్ములాను కొత్త రూపంలో ముందుకు తీసుకువ‌చ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ శ్రేణుల‌తో స‌మావేశం సంద‌ర్భంగా అమిత్‌ షా మాట్లాడారు. వచ్చే ఎన్నికల లోపే అయోధ్య రామాలయం నిర్మాణం చేస్తామని అమిత్ షా భరోసా కార్యకర్తలకు ఇచ్చారు. ఇది పార్టీ ఎజెండాలో మొదటి నుండి ఉన్నదేన‌ని తెలిపారు.

బీజేపీ కి మద్దతు ఇస్తున్న అనేక సంస్థ లు 370 ఆర్టికల్ - యూనిఫామ్ సివిల్ కోడ్ - రామాలయం అంశం ఉంద‌నే విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు. బీజేపీ ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గదని - ఈ ఎన్నికల్లో కొత్తగా వచ్చిన అంశం కాదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శ్రేణులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌న్నారు. బీజేపీ సొంత బ‌లంతోనే రాబోవు ఎన్నిక‌ల్లో ముందుకు వెళ్లేలా అమిత్ షా దిశా నిర్దేశం చేశార‌న్నారు. కేంద్ర ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు వివరించ‌డంతో పాటు.. రాష్ట్ర ప్ర‌భుత్వ అవినీతి - అక్ర‌మాలు - కుటుంబ పాల‌న‌పై బిజెపి మున్ముందు వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 17 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు - 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో బీజేపీని బ‌లోపేతం చేసేలా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌ ఛార్జ్‌ ల‌ను - ఎన్నిక‌ల్లో కృషి చేసే వారిని నియ‌మించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అమిత్ షా సూచించార‌న్నారు. రాష్ట్రంలో ఒంటెద్దు పోక‌డ‌ల‌తో నియంతృత్వ పాల‌న చేస్తున్న టీఆర్ ఎస్ పార్టీని ఎదుర్కొనేలా వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని అమిత్ షా స్ప‌ష్టం చేసినట్లు స‌మాచారం.కాగా - హైద‌రాబాద్ గ‌డ్డ‌పై రామ‌మందిరం జ‌పం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.