Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై రాంమాధవ్ సెటైర్ అదిరిందిగా..

By:  Tupaki Desk   |   19 Jan 2019 11:20 AM IST
చంద్రబాబుపై రాంమాధవ్ సెటైర్ అదిరిందిగా..
X
ఏపీలో ఏమీ సాధించే సత్తా లేనప్పటికీ చంద్రబాబును ఇబ్బందిపెట్టడంలో మాత్రం బీజేపీ ముందుంది. ఆయనకు అన్ని విధాలా అడ్డంపడుతున్న బీజేపీ మాటల దాడి విషయంలోనూ స్పీడుగా ఉంది. ముఖ్యంగా మండల స్థాయి నేత నుంచి జాతీయ స్థాయి నేత వరకు ప్రతిఒక్కరూ చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబును ఏకిపారేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఘాటైన విమర్శలు చేశారు. తన కుర్చీకే భద్రత లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేశాన్ని కాపాడతానంటూ మహాకూటమి పేరుతో రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారని ఆయన అన్నారు.

కడపలో జరిగిన రాయలసీమలోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌ ఛార్జ్‌ ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మరో వ్యక్తి కూడా ఇలానే కూటమి పేరుతో హాస్యాస్పద రాజకీయం చేస్తున్నారని పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను ఉద్దేశించి విమర్శించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంపై నిందలేయడాన్ని - తిట్టడాన్నే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కడపకు ఉక్కు పరిశ్రమ రావడం ఆయనకు ఇష్టం లేదన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు రాసిన ‘చారిత్రక అవసరం మళ్లీ మోదీ’ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు.

కాగా రాంమాధవ్ వ్యాఖ్యలపై ఏపీలో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై మండిపడతున్నారు. మిగతావారు మాత్రం రాంమాధవ్ వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులకు అతికినట్లున్నాయంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏపీలోనే గెలిచే పరిస్థితి లేదని.. కానీ, ఆయన మాత్రం జాతీయ రాజకీయలను మార్చేద్దామని కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని అంటున్నారు.