Begin typing your search above and press return to search.

మోడీ పేరుతో బ్లాక్ మెయిలింగేంది రాంమాధవ్?

By:  Tupaki Desk   |   31 Oct 2019 11:55 AM IST
మోడీ పేరుతో బ్లాక్ మెయిలింగేంది రాంమాధవ్?
X
ప్రధాని మోడీ పేరుతో సరికొత్త సిత్రానికి తెర తీస్తున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని ఎక్కడకు వెళ్లదని.. సమస్యను ప్రధానికి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతామని కొత్త పలుకు పలుకుతున్నారాయన. ఏపీ రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాజధాని అంశం మీద సలహాలు.. సూచనలు ఇవ్వాలని కోరటమే కాదు.. ఇందుకు సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే.

ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయటంలో ఉన్న కష్టనష్టాలతో పాటు.. ఆ పేరుతో బాబు బ్యాచ్ చేసిన దందా భారీగా ఉందన్న ఆరోపణలు భారీగా ఉన్నాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ భారీ ఎత్తున జరిగినట్లుగా విమర్శలు ఉన్నాయి. ఇలాంటివేళ.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. విమర్శలకు. వేలెత్తి చూపించేందుకు ఛాన్స్ ఇవ్వకుండా ఏపీ రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తోంది ఏపీ సర్కారు.

ఇలాంటివేళ ఏపీ రాజధాని గురించి తనదైన తరహాలో రాజకీయాన్ని షురూ చేస్తున్నారు బీజేపీ నేతలు. రాజధాని మార్పు ప్రకటనతో గందరగోళం ఏర్పడిందన్న కొందరి వ్యాఖ్యల్ని ప్రాతిపదికగా తీసుకొని రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల్ని పరిశీలించకుండానే ఆయన తొందరపడి వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పాలి.

రాజధాని అమరావతిని ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిందని.. అదెక్కడికి వెళ్లదని రాంమాధవ్ మాటల్ని ప్రాతిపదిక తీసుకుంటే.. ఆయనో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్.. విభజన కారణంగా నష్టపోతున్న ఏపీకి న్యాయం జరిగేందుకు వీలుగా.. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని మాట ఇచ్చారు.అంతమంది ఎంపీల ముందు.. పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన మాటనే మోడీ సర్కారు ఎలా తుంగలో తొక్కిందో తెలుసు. అలాంటప్పుడు ప్రధాని శంకుస్థాపన చేస్తే మాత్రం రాజధానిగా అమరావతిని మార్చకుండా ఉండాలా? అన్నది ప్రశ్న.

అయితే.. రాజధాని పేరు మీద కేంద్రం ఏపీకి ఇచ్చింది ఎంత? భారీ ఎత్తున నిధులు కుమ్మరించి.. దానికి తగ్గట్లే.. పెద్ద పెద్ద నిర్మాణాలు.. శాశ్విత కట్టడాలు కట్టి ఉంటే.. రాంమాధవ్ లాంటోళ్లు ఇలాంటి మాటలు మాట్లాడటంలో అర్థం ఉంటుంది. అలాంటిదేమీ లేని వేళ.. మోడీ పేరుతో బ్లాక్ మొయిల్ చేయాలనుకున్న రాంమాధవ్ మాటలకు ఏపీ ప్రజలు నవ్వుతారన్న విషయం ఇంకా ఆయనకు అర్థం కానట్లుందే?