Begin typing your search above and press return to search.

వ‌ర్మ అరెస్ట్‌!... ఏపీలో డెమోక్ర‌సీ లేద‌ట‌!

By:  Tupaki Desk   |   28 April 2019 8:51 AM GMT
వ‌ర్మ అరెస్ట్‌!... ఏపీలో డెమోక్ర‌సీ లేద‌ట‌!
X
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ‌కు కాసేప‌టి క్రితం భారీ షాక్ త‌గిలింది. ఏపీ పొలిటిక‌ల్ కేపిట‌ల్ బెజ‌వాడ‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదురు కాగా... చివ‌ర‌కు ఏకంగా ఆయ‌న అరెస్ట్ అయిపోయారు. ఏ విష‌యాన్నీ ఒక్క ప‌ట్టాన వ‌ద‌ల‌ని వ‌ర్మ‌... ఎన్టీర్ బ‌యోపిక్ అంటూ తెర‌కెక్కించిన *ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌* తో పెద్ద దుమారాన్నే రేపారు. టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్ధ‌ర్మ సీఎం నారా చంద్ర‌బాబునాయుడునే ల‌క్ష్యంగా చేసుకుని వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గడానికి రంగం సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఈ సినిమా త‌మ ఇమేజీని ఏ మేర డ్యామేజీ చేస్తుందోన‌న్న భ‌యం టీడీపీ నేత‌ల‌కు ప‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే వారు వ‌ర్మ‌ను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకున్నారు. ఏకంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి చిత్రం రిలీజ్ ను అడ్డుకున్నారు.

అయితే వ‌ర్మ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఏపీ మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో చిత్రాన్ని రిలీజ్ చేసేశారు. తాజాగా ఏపీలో పోలింగ్ ముగియ‌డంతో త‌న చిత్రాన్ని వ‌చ్చే నెల 1న రిలీజ్ చేస్తున్నానంటూ నిన్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంపై మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించేందు కోసం ఆయ‌న నేరుగా విజ‌య‌వాడ‌లో అడుగుపెట్టేశారు. ముందుగానే న‌గ‌రంలోని నోవాటెల్ హోట‌ల్ ను బుక్ చేసుకున్ వ‌ర్మ‌.... అందులోనే ప్రెస్ మీట్ అంటూ మీడియాకు స‌మాచారం అందించారు. అయితే ఎవ‌రి ఒత్తిడో ఏమో తెల‌య‌దు గానీ... నోవాటెల్ చివ‌రి నిమిషంలో వ‌ర్మ‌కు బుక్ చేసిన కాన్ఫ‌రెన్స్ హాల్ ను ర‌ద్దు చేసేసింది.

ఊహించ‌ని ఈ ప‌రిణామంతో ప్ర‌త్యామ్నాయాల‌పై త‌రచి చూసుకుని ఇక లాభం లేద‌నుకున్న వ‌ర్మ‌.... న‌డిరోడ్డు పైనే ప్రెస్ మీట్ పెట్టేస్తానంటూ ప్ర‌క‌టించేశారు. అది కూడా న‌గ‌రంలో ర‌ద్దీగా ఉంటే ఎన్టీఆర్ స‌ర్కిల్ లో సాయంత్రం 4 గంట‌ల‌కు ప్రెస్ మీట్ పెడ‌తాన‌ని - ఈ ప్రెస్ మీట్ కు మీడియా ప్ర‌తినిధుల‌తో పాటుగా ఎన్టీఆర్ అభిమానులు - ఆస‌క్తి ఉన్న సాధార‌ణ జ‌నం కూడా రావ‌చ్చ‌ని ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నేప‌థ్యంలో ర‌చ్చ త‌ప్ప‌ద‌న్న భావ‌న‌తో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు... వ‌ర్మ బెజ‌వాడ‌లో అడుగుపెట్ట‌గానే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. మొత్తంగా వ‌ర్మ‌ను అరెస్ట్ చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించేశారు.

ఈ నేప‌థ్యంలో వ‌ర్మ ఏం త‌క్కువ తిన‌లేదు క‌దా... పోలీస్ స్టేష‌న్ లో ఉంటూనే... త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ సంచ‌ల‌న వ్యాఖ్య‌తో పాటు ఓ వీడియోను పోస్ట్ చేశారు. *నేను ఇప్పుడు పోలీస్ క‌స్ట‌డీలో ఉన్నాను. నిజం చెప్పాల‌ని య‌త్నించ‌డ‌మే నేను చేసిన నేరం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జాస్వామ్య‌మే లేదు* అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్ చేసిన వ‌ర్మ‌... తన‌ను పోలీసులు ఎలా హ్యాండిల్ చేశారన్న విష‌యాన్ని కూడా వివ‌రిస్తూ వీడియో పోస్ట్ చేశారు. అంతేకాదండోయ్‌... ఇలాంటి అరెస్ట్ లు త‌న‌నేమి చేయ‌వ‌న్న కోణంలో స్పందించిన వ‌ర్మ‌... మ‌రిన్ని అప్ డేట్స్ కోసం వేచి చూడాల‌ని కూడా స‌ద‌రు వీడియోలో పేర్కొన్నారు. మొత్తంగా వ‌ర్మ అరెస్ట్ ఇప్పుడు వైర‌ల్ న్యూస్ గా మారిపోయింది.

వీడియో కోసం క్లిక్ చేయండి