Begin typing your search above and press return to search.

మోడీని వణికించేసిన తికాయత్

By:  Tupaki Desk   |   21 Nov 2021 2:30 PM GMT
మోడీని వణికించేసిన తికాయత్
X
రైతు సమస్యలను సానుభూతితో పరిశీలించి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు నరేంద్ర మోడీ ఇస్తున్న బిల్డప్ అంతా కేవలం నాటకమే అని అర్ధమవుతోంది. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో గెలుపు అవకాశాలకు ఎక్కడ గండిపడుతోందో అనే టెన్షన్ మోడిలో ఎక్కవైపోతోంది. ఈ టెన్షన్ను తట్టుకోలేక, వేరేదారిలేక వ్యవసాయ చట్టాలను మోడి రద్దు చేశారు. ఈ మొత్తంలో మోడిని వణికించేసింది మాత్రం రైతు నేత, జాట్ సామాజికవర్గంలో కీలక నేత అయిన రాకేష్ తికాయత్.

మోడి, బీజేపీని ప్రధానంగా కలవరపరిచింది యూపిలోని పశ్చిమ ప్రాంతమే అని అర్ధమవుతోంది. పశ్చిమ ప్రాంతంలోని 26 జిల్లాల్లో 136 అసెంబ్లీ స్ధానాలున్నాయి. వ్యవసాయ చట్టాల కారణంగా అన్నీ స్ధానాల్లోను భారీగా దెబ్బ పడబోతోందని మోడికి స్ధానిక బీజేపీ నేతల నుండే కాకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సమాచారం ఇచ్చాయట. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ ప్రాంతంలో జాట్లు, ముస్లింలదే కీలక పాత్ర. జాట్ సామాజవకవర్గం సుమారు 20 శాతం, ముస్లింలు సుమారు 30 శాతం ఉన్నారట.

జాట్ సామాజికవర్గానికి తికాయత్ తిరుగులేని నేత. అలాగే ముస్లింల్లో కూడా తికాయత్ కు మంచి పట్టుంది. అందుకనే మొన్నటి సెప్టెంబర్లో ముజఫర్ నగర్లో నిర్వహించిన బహిరంగసభకు జాట్+ముస్లింలు పోటెత్తారు. కేంద్రానికి వ్యతిరేకంగా తికాయత్ ఒక పిలుపివ్వగానే లక్షలాదిమంది బహిరంగసభకు హాజరయ్యారు. ఈ ప్రాంతంలో 2017 ఎన్నికల్లో బీజేపీకి 103 సీట్లొచ్చాయి. మరి రేపటి ఎన్నికల్లో ఎన్నిసీట్లొస్తాయంటే బీజేపీ నేతలు సమాధానం చెప్పే పరిస్ధితిలో లేరు. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారమైతే ఈ ప్రాంతంలో బీజేపీకి పట్టుమని పది సీట్లు కూడా వచ్చే అవకాశం లేదట.

ఈ నివేదికను చూసిన తర్వాతే మోడీలో టెన్షన్ పెరిగిపోయిందట. తికాయత్ ప్రభావం పశ్చిమ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని మిగిలిన ప్రాంతాలకు కూడా పాకుతోందని పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంగా చెప్పాయట. దాంతో తత్వం బోధపడిన మోడి వెంటనే కీలకమైన నేతలతో సమావేశం ఏర్పాటు చేశారట. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీలు గెలవకపోతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలుండవు. అప్పుడు ఎక్కువమంది ఎంపీలు గెలవలాంటే రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉండక తప్పదు.

యూపీలో అధికారంలోకి రావాలంటే తక్షణమే చేయాల్సిన పనేమిటంటే ముందు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ఒకటే మార్గమని మోడికి అర్ధమైపోయింది. మరి వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేస్తుందా ? ఈ ప్రశ్నకు కమలనాథులు ఎవరు స్పష్టంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చేస్తామని స్పష్టంగా చెప్పలేకపోయినా ముందైతే ధైర్యంగా ప్రచారానికి అయితే వెళ్ళచ్చు కదాని లోకల్ లీడర్లు హ్యాపీగా ఉన్నారట. రేపటి ఎన్నికల్లో ఏమి జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.