Begin typing your search above and press return to search.

ఆయనే ఆర్ బీఐ తర్వాతి గవర్నరా?

By:  Tupaki Desk   |   23 Jun 2016 4:20 AM GMT
ఆయనే ఆర్ బీఐ తర్వాతి గవర్నరా?
X
ఆర్ బీఐ గవర్నర్ గా వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న రఘురాం రాజన్ వారసుడి ఎంపిక పూర్తి అయ్యిందా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. రఘురాం రాజన్ తర్వాత ఆర్ బీఐ గవర్నర్ గా ఈ సంస్థ మాజీ డిప్యూటీ గవర్నర్ గా పని చేసిన రాకేశ్ మోహన్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఐంఎంఎప్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి)లో మన దేశం తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఆయనకే ఆర్ బీఐ గవర్నర్ కుర్చీలో కూర్చోనున్నట్లుగా ఆర్థిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్.. యేల్ వర్సటీల్లో చదువుకున్న మోహన్ అమెరికాలోని ప్రిన్స్ టన్ వర్సిటీలో ఎకనామిక్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు. 2001-02 మధ్య ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు.ఈయన నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఆయనకే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఇదేమీ నిజం కాదంటూ మరికొన్ని పేర్లు కూడా వినిపించటం గమనార్హం. అర్ బీఐ గవర్నర్ రేసులో ఉన్నట్లుగా చెబుతున్న పేర్లలో ఎస్ బీఐ ఛైర్ పర్సన్ గా పదవీ విరమణ చేయనున్న అరుంధతీ భట్టాచార్య.. ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్.. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్.. ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. ముఖ్యఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇన్ని పేర్లు వినిపిస్తున్నా.. రాకేశ్ మోహన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.