Begin typing your search above and press return to search.

కవిత కు రాజ్యసభ.. కేసీఆర్ అసలు ప్లాన్ ఇదే?

By:  Tupaki Desk   |   3 Jan 2020 4:23 AM GMT
కవిత కు రాజ్యసభ.. కేసీఆర్ అసలు ప్లాన్ ఇదే?
X
తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అఖండ మెజార్టీ తో గెలిచారు. అసలు ఎదురేలేదు.. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అంతే జోష్ తో గెలవలేదు. తెలంగాణలో గులాబీ పార్టీ కి ఎదురు లేదు.. ఢిల్లీలో దిక్కులేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆ లోటును భర్తీ చేసేందుకే కేసీఆర్ తన కూతురు కవితను ఢిల్లీలో దించబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ తరుఫున ఢిల్లీ లో వాణి వినిపించే నాథుడే లేకుండా పోయారు. సమర్థులైన వారు లేకపోవడంతో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరి చివరి నిమిషంలో ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావునే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా చేసింది. ఆయన వాగ్ధాటిగా అనర్గళంగా హిందీ, ఉర్దూ సహా ప్రాంతీయ భాషల్లో మాట్లాడలేని పరిస్థితి. ఇక ఢిల్లీలోనూ అంతగా పరిచయాలు లేవంటారు. పనులు చేయలేని దుస్థితి. ఇక కురువృద్ధుడు కేకే అంతంతే.. అందుకే ఢిల్లీ లో తెలంగాణ తరుఫున అన్ని చక్కదిద్దే వ్యక్తి లోటు స్పష్టంగా కనిపిస్తోందట..

ఏప్రిల్ లో తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. దాదాపు 90కుపైగా ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఈ రెండు సీట్లు కూడా గులాబీ పార్టీకే దక్కనున్నాయి. అయితే ప్రస్తుతం గులాబీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేకే కూడా ఏప్రిల్ లో రిటైర్ కాబోతున్నారు. ఈసారి ఆయన ను రాష్ట్ర రాజకీయ, ప్రభుత్వ అధికారాలకే పరిమితం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారట.. కేకే ను ప్రభుత్వ సలహాదారుగా చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈసారి ఆయన రాజ్యసభ సీటు రెన్యువల్ కాదంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు..

తెలంగాణలో ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ సీట్లు గులాబీ పార్టీ కే దక్కనున్నాయి. వాటిల్లో ఒకటి కేసీఆర్ కూతురు కవితకు ఖాయంగా కనిపిస్తోంది. కవితకు ఇంగ్లీష్, హిందీ, ఉర్ధూ, తెలుగు ప్రాంతీయ భాషల్లోనూ పట్టు ఉంది. అనర్గళంగా మాట్లాడగలదు. ఇక ఢిల్లీలో వ్యవహారాలు చక్కదిద్దగలదు. మొదటి సారి ఎంపీగానే కవిత అదరగొట్టింది. ఢిల్లీలో కీలకంగా వ్యవహరించింది. పనులు చేసిపట్టింది. ఓడిపోవడంతో దూరమైంది. రెండో రాజ్యసభ సీటు రేసులో ఖమ్మం ఎంపీగా టికెట్ దక్కని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సురేష్ రెడ్డి, నాయిని, మధుసూదనాచారి పోటీ పడుతున్నారు.

అయితే కరీంనగర్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ గెలిస్తే ఢిల్లీలో టీఆర్ఎస్ తరుఫున కీలకంగా ఉండేవారు. కానీ ఆయన ఓడడం.. కవిత కూడా ఓడిపోవడంతో టీఆర్ఎస్ కు ఢిల్లీలో దిక్కులేకుండా పోయింది. ఇప్పుడు కవితను రాజ్యసభకు పంపడం ద్వారా ఆలోటును కేసీఆర్ భర్తీ చేయబోతున్నారు.