Begin typing your search above and press return to search.

అనూహ్యం.. తెలంగాణ బీజేపీ నుంచి లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు

By:  Tupaki Desk   |   31 May 2022 4:30 AM GMT
అనూహ్యం.. తెలంగాణ బీజేపీ నుంచి లక్ష్మణ్ కు రాజ్యసభ సీటు
X
అంతా ముగిసిపోయింది.. ఇక లేదనుకున్న దశలో తెలంగాణ బీజేపీ నేత కె.లక్ష్మణ్ కు అదృష్టం వరించింది. బీజేపీ అధిష్టానం తాజాగా ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కు చోటు లభించింది. దీంతో ఆయనకు బీజేపీ నేతలు, మిత్రులు, సన్నిహితులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన కె.లక్ష్మణ్ గతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ నుంచి 1999, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్న బీజేపీ అధిష్టానం పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే లక్ష్మణ్ కు సీటు ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే లక్ష్మణ్ కు సీటు ఇవ్వడం ద్వారా తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలను, ముఖ్యంగా మున్నూరు కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవచ్చని భావిస్తోంది. ఇప్పటికే మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు పెద్ద పీట వేసే లక్ష్యంతో, మున్నూరు కాపు సామాజికవర్గాన్ని మరింత మచ్చిక చేసుకునే ఉద్దేశంతో కె.లక్ష్మణ్ కు బీజేపీ రాజ్యసభ సీటు కట్టబెట్టిందని చెప్పుకుంటున్నారు.

అయితే.. కనీసం తెలంగాణ బీజేపీ నుంచి ఇద్దరికైనా రాజ్యసభ సీట్లు లభిస్తాయనుకుంటే కేవలం ఒక్కరికి మాత్రమే దక్కడంతో మిగిలిన నేతల్లో నిరాశ అలుముకుంది. మాజీ ఎంపీలు విజయశాంతి, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జి.వివేక్, మాజీ మంత్రి డికె అరుణ, మురళీధర్ రావు, తదితరులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరందరికీ బీజేపీ అధిష్టానం నిరాశనే మిగిల్చింది. కేవలం లక్ష్మణ్ కు మాత్రమే చాన్స్ ఇచ్చంది. సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలు, సామాజిక సమీకరణాలు అన్నీ లక్ష్మణ్ కు కలసిరావడంతో ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసింది.

1960లో పుట్టిన లక్ష్మణ్ 1980లో బీజేపీ అనుబంధ విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు. 1994లో బీజేపీ హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1995-99 వరకు బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999లో గెలిచిన ఆయన మళ్లీ 2004, 2009ల్లో ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2016 నుంచి 2020 వరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2020 సెప్టెంబర్ నుంచి బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా లక్ష్మణ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎమ్మెస్సీ, పీహెచ్ డీ చదివారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులకు అవకాశం దక్కుతుందని వార్తలు వచ్చినా వీరికి నిరాశే మిగిలింది.