Begin typing your search above and press return to search.

కేసీఆర్ దోస్తుకు రాజ్య‌స‌భ ప‌ద‌వి

By:  Tupaki Desk   |   17 Feb 2016 5:30 PM GMT
కేసీఆర్ దోస్తుకు రాజ్య‌స‌భ ప‌ద‌వి
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో రికార్డ్ స్థాయి సీట్లు, నారాయ‌ణ‌ఖేడ్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు జోష్ మీదున్న గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రింత దూకుడుగా వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. భ‌విష్య‌త్‌లో జ‌రిగే ప‌రిణామాల‌కు ఒకింత‌ ముంద‌స్తుగానే సిద్ధ‌మ‌య్యే కేసీఆర్ ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో జ‌ర‌గనున్న ఎన్నిక‌ల‌పై దృష్టిసారించార‌ని తెలుస్తోంది. మ‌రికొద్ది నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌ట్నుంచే కేసీఆర్ రెడీ అవుతున్నార‌ని, అందులో ఒక బెర్త్ ఆయ‌న స‌న్నిహితుడికి ఖరారైంద‌ని తెలుస్తోంది.

తెలంగాణ నుంచి త్వ‌ర‌లో రెండు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కానున్నాయి. కార్య‌క‌ర్త‌ల కోటా అంటూ త‌న‌కు తాను సృష్టించుకున్న కోటా నుంచి ఎంపీగా ఎన్నిక‌వుతున్న‌ కాంగ్రెస్ నాయకుడు వీ హ‌నుమంత‌రావు, టీడీపీ త‌ర‌ఫున నామినేట్ అయిన గుండు సుధారాణిల ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఏర్ప‌డే ఖాళీల ద్వారా ద‌క్కే బెర్తుల్లో ఒకటి త‌న మిత్రుడి ద్వారా భ‌ర్తీ చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారికి ఈ పోస్టు ఖాయ‌మైంద‌ని చెప్తున్నారు.

1969 తెలంగాణ ఉద్య‌మం నుంచి కేసీఆర్‌ తో ర‌మణాచారికి దోస్తీ ఉంది. అనంత‌రం సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెద‌క్ క‌లెక్ట‌ర్‌ గా ప‌నిచేసిన స‌మ‌యంలో, ఉమ్మ‌డి రాష్ర్ట ముఖ్య‌మంత్రిగా చంద్రబాబు ఉన్నపుడు ఆయ‌న టీంలోని కీల‌క ఐఏఎస్ అధికారిగా ర‌మ‌ణాచారి ప‌నిచేసిన‌పుడు కేసీఆర్‌ తో మ‌రింత స‌ఖ్య‌త కుదిరింది. ఈ మితృత్వ‌మే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ర‌మ‌ణాచారిని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రత్యేక ప్ర‌తినిధి హోదాలో కేబినెట్ కుర్చి ద‌క్కించేందుకు కార‌ణ‌మైంద‌ని చెప్తున్నారు. ఇదే ఊపులో మాజీ ఉన్న‌తాధికారి అయిన ర‌మ‌ణాచారిని రాజ్య‌స‌భ‌కు పంపే అవ‌కాశం ఉన్న‌ట్లు గులాబీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.