Begin typing your search above and press return to search.

వైసీపీలో రాజ్యసభ రేసు.. ఆ నలుగురు వీరేనా?

By:  Tupaki Desk   |   25 Feb 2020 1:30 PM GMT
వైసీపీలో రాజ్యసభ రేసు.. ఆ నలుగురు వీరేనా?
X
రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో 2 స్థానాలు, ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఈ షెడ్యూల్ లో ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆశావహులంతా ఇప్పుడు సీఎంలు కేసీఆర్, జగన్ ల వైపు చూస్తున్నారు.

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఇప్పుడు ఏపీలో అధికార వైసీపీ పార్టీలో ఆశావహుల సందడి మొదలైంది. సీఎం జగన్ ఎన్నికల వేళ చాలా మందికి ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. పైగా శాసనమండలిని కూడా రద్దు చేయడంతో వారికి కూడా రాజ్యసభపై హామీ ఇచ్చారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ఆ నలుగురు రాజ్యసభ సీట్లు పొందే నాయకులెవరు అనే దానిపై దాదాపు ఓ క్లారిటీ కి వచ్చినట్టు తెలిసింది.

ఏపీలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం కారణంగా మొత్తం నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో సీఎం జగన్ ఈ స్థానాలు ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే కేంద్రంలోని బీజేపీతో సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది.

ఏపీలో ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో జగన్ ఇప్పటికే నలుగురి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తొలి నుంచి వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉంటున్న అయోద్య రామిరెడ్డికి ఒక రాజ్యసభ సీటు ఖాయం అంటున్నారు. ఇక బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త , వైసీపీ నేత బీద మస్తాన్ రావుకు సైతం మరో సీటు అంటున్నారు. ఎస్సీ కోటాలో అమలాపురంకు చెందిన రవీంద్రబాబుకు ఖాయం అంటున్నారు. ఇక ఎన్నికల సమయం లో పార్టీ కోసం ప్రచారం చేసిన నటుడు మోహన్ బాబు కూడా వినిపిస్తోంది. ప్రముఖ న్యాయకోవిదుడి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇక శాసనమండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోతున్న పిల్లి సుభాష్ , మోపిదేవీలకు రాజ్యసభ ఇవ్వక పోవచ్చు అంటున్నారు. వారిద్దరికి మండళ్ల ప్రాంతీయ చైర్మన్లు ఇస్తారనే ప్రచారం సాగుతోంది.