Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ‌లో ఏపార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయ్‌

By:  Tupaki Desk   |   23 March 2018 10:21 AM GMT
రాజ్య‌స‌భ‌లో ఏపార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయ్‌
X
ఈ రోజు (శుక్ర‌వారం) ఉద‌యం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 59 సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కొన్నిచోట్ల ఏక‌గ్రీవం కాగా.. మ‌రికొన్నిచోట్ల మాత్రం పోలింగ్ జ‌రుగుతోంది. కొన్నిచోట్ల పోటీ అవ‌స‌రం లేకుండా సాగుతోంది.

మ‌రి.. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉండ‌నున్నాయి? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? రాష్ట్రాల వారీగా పార్టీల వారీగా గెలిచే సీట్లు ఎన్ని అన్న విష‌యంలోకి వెళితే..

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న అంచ‌నా ప్ర‌కారం ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక మొత్తంగా బీజేపీ బ‌లం రాజ్య‌స‌భ‌లో 58 నుంచి 69కు పెరిగే అవ‌కాశం ఉంది. బీజేపీ గెలిచే సీట్ల‌లో అత్య‌ధికం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచే రానున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌

+ ఎనిమిది స్థానాల్ని బీజేపీ సొంతం చేసుకోనుంది. ఇందులో భాగంగా అరుణ్ జైట్లీ.. అశోక్ బాజ‌య్ పేయ్.. విజ‌య్ పాల్ సింగ్ తోమ‌ర్.. స‌క‌ల్ దీప్ రాజ్ భ‌ర్.. కాంతా క‌ర్డ‌మ్.. అనిల్ జైన్.. హ‌ర్నాథ్ సింగ్ యాద‌వ్‌.. జీవీఎల్ న‌ర‌సింహారావు ఎన్నిక కానున్నారు.

+ స‌మాజ్ వాదీ పార్టీ నుంచి ఒక్క‌రు గెల‌వ‌నున్నారు. అది సీనియ‌ర్ న‌టి జ‌యాబ‌చ్చ‌న్

+ బీజేపీ మ‌ద్ద‌తుతో ఒక స్వ‌తంత్ర అభ్య‌ర్థి అనిల్ అగ‌ర్వాల్ గెలిచే వీలుంది. ప‌దో సీటుకు మాయావ‌తి పోటీ ప‌డుతున్నా.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు తాను పార్టీ నిలిపిన అభ్య‌ర్థికి ఓటు వేయ‌లేద‌ని చెప్పిన నేప‌థ్యంలో బీజేపీ బ‌ల‌ప‌ర్చిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించే వీలుంది.

కేర‌ళ‌

+ వామ‌ప‌క్ష నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఎంపీ వీరేంద్ర కుమార్.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కు చెందిన బాబు ప్ర‌సాద్ లు పోటీలో ఉండగా వీరేంద్ర‌కుమార్ విజ‌యం సాధించ‌నున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్‌

+ ఐదు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా అందులో నాలుగు స్థానాల్ని అధికార పార్టీ టీఎంసీకి చెందిన అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌నున్నారు.న‌దీముల్ హ‌క్.. సుభాశిష్ చ‌క్ర‌వ‌ర్తి.. అభీర్ విశ్వాస్.. సంత‌ను సేన్ లు ఎంపీలుగా గెల‌వ‌నున్నారు. మరో స్థానాన్ని కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలిచే వీలుంది. కాకుంటే.. టీఎంసీ ఎమ్మెల్యేల ఓట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి.

తెలంగాణ‌

+ మూడు సీట్లు ఉండ‌గా.. అధికార టీఆర్ఎస్ కు చెందిన జె. సంతోష్ కుమార్.. బి. లింగ‌య్య యాద‌వ్‌.. బి. ప్ర‌కాష్ ముదిరాజ్ లు గెలిచే వీలుంది. బ‌లం లేకున్నా కాంగ్రెస్ త‌న పార్టీ అభ్య‌ర్థిని బ‌రిలో నిలిపింది. అద్భుతం జ‌రిగితే త‌ప్పించి కాంగ్రెస్ అభ్య‌ర్థి బ‌ల‌రాం నాయ‌క్ గెలిచే అవ‌కాశం లేదు.

జార్ఖండ్‌

+ రెండు సీట్లు ఉండ‌గా.. బీజేపీకి చెందిన స‌మీర్ ఉర్న‌వ్.. ప్ర‌దీప్ కుమార్ సంతాలియాలు గెలిచే వీలుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

+ మొత్తం మూడు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. అధికార టీడీపీ ఇద్ద‌రు అభ్య‌ర్థులు సీఎం ర‌మేశ్‌.. కె.ర‌వీంద్ర‌కుమార్ ల‌ను నిల‌ప‌గా.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వి. ప్ర‌భాక‌ర్ రెడ్డిని నిలిపింది. పోటీ లేనందున ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

క‌ర్ణాట‌క‌

+ నాలుగు సీట్ల‌కు ఎంపీలు ఎంపిక‌య్యే అవ‌కాశం ఉంది. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఒక బీజేపీ అభ్య‌ర్థి గెలిచే వీలుంది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎల్. హ‌నుమంత‌య్య‌.. న‌సీర్ హుస్సేన్.. జీసీ చంద్ర‌శేఖ‌ర్ విజ‌యం సాధించే వీలుంది. బీజేపీ త‌ర‌ఫున రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ బ‌రిలో ఉన్నారు. ఆయ‌నా గెలిచే వీలుంది.

ఛ‌త్తీస్ గ‌ఢ్‌

+ ఒక సీటుకు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి స‌రోజ్ పాండే గెల‌వ‌నున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌

+ ఐదు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా బీజేపీ నాలుగు స్థానాల‌కు అభ్య‌ర్థుల్ని నిలిపింది. త‌వేర్ చంద్ గెహ్లాట్‌.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్.. అజ‌య్ ప్ర‌తాప్ సింగ్.. కైలాస్ సోనీలు బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తుంటే.. కాంగ్రెస్ త‌ర‌ఫున రాజ్ మ‌నీ ప‌టేల్ బ‌రిలో ఉన్నారు. దీంతో ఎన్నిక ఏక‌గ్రీవమైంది.

బిహార్‌

+ ఆరు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతోంది. జేడీ నుంచి ఇద్ద‌రు.. బీజేపీ నుంచి ఒక‌రు.. ఆర్జేడీ నుంచి ఇద్ద‌రు.. కాంగ్రెస్ నుంచి ఒక‌రు బ‌రిలో ఉన్నారు. పోటీ లేనందున ఏక‌గ్రీవ‌మైంది. జేడీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు వెళ్లే వారు వ‌శిష్ట నారాయ‌ణ సింగ్‌.. మ‌హేంద్ర ప్ర‌సాద్‌.. బీజేపీ త‌ర‌ఫున కేంద్ర‌మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌.. ఆర్జేడీ త‌ర‌ఫున మ‌నోజ్ ఝూ.. అస్సాక్ క‌రీం.. కాంగ్రెస్ త‌ర‌ఫున అఖిలేష్ ప్ర‌సాద్ సింగ్ ఉన్నారు.

గుజ‌రాత్‌

+ నాలుగు స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేపీ రెండు స్థానాలు (పురుషోత్త‌మ్ రూపాల‌.. మ‌న్ సుఖ్ భాయ్ మాండ‌వ్యా).. కాంగ్రెస్ మ‌రో రెండు స్థానాల్లో (అమియాజ్ఞానిక్, నరన్ రాంధ్వా)లు రంగంలో ఉన్నారు. పోటీ లేనందున ఏక‌గ్రీవ‌మైంది.

హ‌ర్యానా

+ ఒక్క స్థానానికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున రిటైర్డ్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డిపి వ‌త్స్య బ‌రిలో ఉన్నారు. ఆయ‌న ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌

+ ఒక స్థానం ఉండ‌గా.. దీనికి కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా బ‌రిలో ఉన్నారు. ఆయ‌న ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

మ‌హారాష్ట్ర

+ మ‌హారాష్ట్రలో మొత్తం ఆరు స్థానాలు ఉండ‌గా.. బీజేపీ ముగ్గురు (నారాయ‌ణ్ రాణే.. ప్ర‌కాశ్ జ‌ద‌వేద‌క‌ర్.. ముర‌ళీధ‌ర‌న్‌) కాంగ్రెస్ త‌ర‌ఫున ఒక‌రు (కుమార్ కేట్క‌ర్‌).. ఎన్సీపీ త‌ర‌పున ఒక‌రు (వంద‌న చ‌వాన్).. శివ‌సేన త‌ర‌ఫున (అనిల్ బ‌లూనీ) బ‌రిలో ఉండ‌టంతో ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

ఒడిశా

+ మొత్తం మూడు స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేడీ త‌ర‌ఫున ముగ్గురు అభ్య‌ర్థులు (ప్ర‌శాంత్ నందా.. సౌమ్య రంజ‌న్ ప‌ట్నాయ‌క్.. అచ్యుత స‌మంత‌) బ‌రిలో ఉన్నారు. పోటీ లేనందున ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

రాజ‌స్థాన్‌

+ మొత్తం మూడు స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థులే బ‌రిలో ఉండ‌టంతో వారి ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.