Begin typing your search above and press return to search.

రాజ్యసభ ఎన్నికల రిజల్ట్ ఇదే బాస్..

By:  Tupaki Desk   |   11 Jun 2016 4:34 PM GMT
రాజ్యసభ ఎన్నికల రిజల్ట్ ఇదే బాస్..
X
రాజ్యసభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 30 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 27 స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. ఈ సీట్లు మొత్తం ఏడు రాష్ట్రాల్లో జరిగాయి. తాజాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఉత్తరప్రదేశ్ లో 11 స్థానాలకు.. కర్ణాటక.. రాజస్థాన్ రాష్ట్రాల్లో నాలుగేసి సీట్ల చొప్పున.. మధ్య ప్రదేశ్ లో మూడు స్థానాలకు.. హర్యానా.. జార్ఖండ్ రాష్ట్రాల్లో రెండేసి చొప్పు.. ఉత్తరాఖండ్ లో క స్థానంలో ఎన్నికలు జరిగాయి. ఇక.. ఫలితాలు చూస్తే..

ఉత్తరప్రదేశ్ లోని 11 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ మొత్తం ఏడు స్థానాల్ని.. బీఎస్పీ రెండు స్థానాలు.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క స్థానం చొప్పున రాజ్యసభ స్థానాల్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కపిల్ సిబల్ విజయం సాధించారు. ఇక.. రాజస్థాన్ లోని నాలుగు స్థానాల్లో కేంద్రమంత్రితో పాటు.. మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. ఇక.. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో మూడు స్థానాల్ని కాంగ్రెస్ చేజిక్కించుకోగా.. ఒక్కస్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విజయం సాధించగా.. కాంగ్రెస్ తరఫున జైరాం రమేష్.. అస్కార్ ఫెర్నాండెజ్.. కేసీ రామ్మూర్తి విజయం సాధించారు.

ఇక.. మధ్య ప్రదేశ్ లోని మూడు స్థానాల్లో రెండింటిని బీజేపీ విజయం సాదించగా.. మరోస్థానంలో కాంగ్రెస్ మద్దతుతో వివేక్ టంగా గెలిచారు. బీజేపీ నుంచి సీనియర్ పాత్రికేయులు ఎంజే అక్బర్.. అనిల్ మాధవ్ దావే గెలిచారు.

హర్యానాలోని రెండుస్థానాలకు ఒక స్థానంలో బీజేపీ తరఫున కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ విజయం సాధించగా.. మరోస్థానంలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి సుభాష్ చంద్ర గెలుపొందారు. జార్ఖండ్ లోని రెండుస్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధించింది. ఇక్కడ నుంచి కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.. మహేశ్ పొడ్డార్ గెలుపొందారు. ఉత్తరాఖండ్ లో జరిగిన ఒక స్థానంలో కాంగ్రెస్ తరఫున ప్రదీప్ టంటా విజయం సాధించారు.

తాజా ఫలితాలతో రాజ్యసభలో బీజేపీ బలం స్వల్పంగా పెరగ్గా.. అదే సమయంలో కాంగ్రెస్ బలం ఆ మేర తగ్గింది. అయితే.. ఇప్పటికి బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ బలమే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజా ఫలితాల నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలం 49 నుంచి 54కు పెరగ్గా.. కాంగ్రెస్ బలం 64 నుంచి 57కు తగ్గిపోయింది. తాజా ఎన్నికల ఫలితాల కారణంగా బీజేపీకి పెరిగిన బలంతో అద్భుతాలు ఏమీ జరగనప్పటికీ.. గతంలో పోలిస్తే.. చికాకులు కాస్త మాత్రమే తగ్గే వీలుంది.