Begin typing your search above and press return to search.

రాజుగారు మళ్లీ మొదలెట్టేశారు: తప్పుదారి పట్టేలా ఈ మాటలేందండి?

By:  Tupaki Desk   |   1 Jan 2021 4:22 PM IST
రాజుగారు మళ్లీ మొదలెట్టేశారు: తప్పుదారి పట్టేలా ఈ మాటలేందండి?
X
రాజుగారు మళ్లీ మొదలెట్టేశారు. పేరుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినప్పటికీ తరచూ పార్టీ అధినేతపైనా.. పార్టీపైనా.. ప్రభుత్వంపై విపక్షం మాదిరి మాటలతో చిరాకు పెట్టేయటం రఘురామ కృష్ణమ రాజుకు ఒక అలవాటుగా మారిందని చెప్పాలి. ఆ మధ్యన కొన్ని రోజుల పాటు సీరియల్ నడిపించినట్లుగా రోజుకో అంశం మీద జగన్ ప్రభుత్వంపై విమర్శలు.. ఆరోపణలు చేసేవారు. ఈ మధ్యన తన నోటికి విశ్రాంతి ఇచ్చిన ఆయన.. తాజాగా మీడియాతో మాట్లాడి.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా వ్యాఖ్యలు చేశారు.

ఏపీలోని హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్న సీఎం జగన్ స్పందించటం లేదని మండిపడిన ఆయన.. గురువారం సీఎం జగన్ చేసిన హెచ్చరికను మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. దేవుడితో ఆటలు వద్దని.. అదేమాత్రం మంచిది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. ముఖ్యమంత్రి ఏమీ చేయలేదన్న నెగిటివ్ యాంగిల్ తప్పించి.. తన మాటల్లో.. విమర్శల్లో కచ్ఛితత్వం పాళ్లు తగ్గిపోయిన విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అయితే.. కొన్నివిషయాల్ని మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉండేలా ప్రస్తావించటం గమనార్హం.

రామతీర్థం ఘటన మరవక ముందే రాజమండ్రిలో మరో ఘటన చోటు చేసుకోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల మీద దాడుల నేపథ్యంలో పద్దెనిమిది నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారన్నారు. సీఎంమాటలు కంటితుడుపుగా కాకుండా కఠిన చర్యలు తీసుకునేలా ఉండాలన్నారు.

ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర డీజీపీ ఇతర మతానికి చెందిన వారు కాబట్టే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్న తీవ్ర ఆరోపణను చేశారు. జరుగుతున్న ఉదంతాలపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఒక దారుణ ఘటన జరిగినప్పుడు.. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలనటం సబబు. అదే సమయంలో.. ప్రభుత్వం కావాలనే తప్పులు చేసిన వారిని వెనకేసుకొస్తే.. దానికి సంబంధించిన ఆధారాలు చూపించి ప్రశ్నించటం.. ఆరోపణల మరక వేయటం బాగుంటుంది. అంతే తప్పించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడట.. మతం లాంటి సున్నిత విషయాల్లో బాధ్యతరాహిత్యంతో వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు రాజుగారు.