Begin typing your search above and press return to search.

రెండింటికి చెడిన రేవడిలా ఒకే ఒక్కడు

By:  Tupaki Desk   |   23 Jun 2021 4:08 AM GMT
రెండింటికి చెడిన రేవడిలా ఒకే ఒక్కడు
X
అరుదైన అవకాశం ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటివేళలో ప్రలోభాలకు లొంగక.. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తే.. ఆ రాజకీయ నేతకు వచ్చే మైలేజీ అంతా ఇంతా కాదు. కానీ.. ఆ విషయాన్ని చాలా తక్కువ మందే గుర్తిస్తుంటారు. ఆశకు పోయి తమకున్న ప్రత్యేకతను పోగొట్టుకొని రెంటికి చెడ్డ రేవడిలా మారటం రాజకీయాల్లో తరచూ చూస్తుంటాం.తాజాగా అలాంటి పరిస్థితి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

పార్టీ అధినేత ఓటమిపాలై.. ఒక్కడు మాత్రమే గెలవటానికి మించిన అసాధారణ ఘటన ఇంకేం ఉంటుంది. అలాంటప్పుడు ఆ నేతకు దక్కే గౌరవ.. మర్యాదలు మామూలుగా ఉండవు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన రాపాక విజయం సాధించటం.. అదే సమయంలో ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను బరిలో నిలిచిన రెండు చోట్ల ఓటమి పాలు కావటం సంచలనంగా మారింది.

2019లో జనసేన తరఫున పోటీ చేయటానికి ముందు కూడా 2009లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. జనసేనలో ఒకే ఒక్కడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన.. తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటం ద్వారా సంచలనంగా మారారు. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం అప్పుడే మొదలైంది.కానీ.. ఆ వార్తల్ని రాపాక ఖండించారు.

అయితే.. తర్వాత రోజుల్లో ఆయన వ్యవహారశైలి పేరుకు జనసేన ఎమ్మెల్యే కానీ.. వ్యవహరించేదంతా వైసీపీ ఎమ్మెల్యే మాదిరి అన్న విమర్శను మూటగట్టుకున్నారు. దీనికి తోడు వైసీపీకి చెందిన నేతలపై పెత్తనం చెలాయించటంతోపాటు తనకు నచ్చని వారిపై వేటు వేయించటమో.. పక్కకు తప్పించటమో చేయటంతో ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలు సైతం రాపాకను దగ్గరకు రానివ్వటం లేదంటున్నారు.

తన కొడుకును సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్పించిన రాపాక.. రాజోలు వైసీపీ కూడా తనదేనంటూ చేసుకుంటున్న ప్రచారం అటు జనసేన కార్యకర్తల్ని మాత్రమే కాదు.. ఇటు వైసీపీ కిందిస్థాయి నేతలకు ఒళ్లు మండేలా చేస్తుందని చెబుతున్నారు.

జనసేనలో నెంబర్ వన్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి.. రాజకీయంగా సరైన విజన్ లేని కారణంగా ఈ రోజున ఆయన వైసీపీలో 152వ ఎమ్మెల్యేగా కొనసాగాల్సి వచ్చిందంటున్నారు. ఏమైనా.. రెండిటికి చెడ్డ రేవడిగా మారారన్న మాట వినిపిస్తోంది. చేతులారా చేసుకోవటం అంటే ఏమిటన్న దానికి రాపాక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారనటంలో సందేహం లేదు.