Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్‌గా ర‌జ‌నీకాంత్.. బీజేపీ ల‌క్ష్యం అదేనా?

By:  Tupaki Desk   |   18 Aug 2022 10:30 AM GMT
గ‌వ‌ర్న‌ర్‌గా ర‌జ‌నీకాంత్.. బీజేపీ ల‌క్ష్యం అదేనా?
X
త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌పై ఊహాగానాలు కొన‌సాగుతున్నాయి. గ‌తంలో పార్టీ ఏర్పాటుపై, ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై మీన‌మీషాలు లెక్కించి త‌మిళ ప్ర‌జ‌ల దృష్టిలో కొంత అభాసుపాల‌య్యారు.. ర‌జ‌నీ. అభిమానుల‌తో కూడా స‌మావేశాలు నిర్వ‌హించి చివ‌ర‌కు ఉసూర‌మ‌నిపించారు. రాజ‌కీయాల్లోకి తాను రావ‌డం లేద‌ని.. ఎన్నిక‌ల్లో పోటీ చేసేది కూడా లేద‌ని తేల్చిచెప్పారు. ఇందుకు అనారోగ్య కార‌ణాల‌ను ర‌జినీ సాకుగా చూపినా బీజేపీ ఒత్తిడితోనే ఆయ‌న త‌మిళ‌నాడులో గ‌త అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అందులోనూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ర‌జ‌నీకాంత్‌కు మంచి మితృత్వం ఉంది. గ‌తంలో చెన్నై వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా ర‌జినీకాంత్ ఇంటికి వెళ్లారు. కొన్ని గంట‌ల పాటు అక్క‌డ గ‌డిపారు. అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అన్నాడీఎంకేను ఉప‌యోగించుకుని త‌మిళ‌నాడులో కాలు మోపాల‌ని క‌మ‌ళ ద‌ళం ఎప్ప‌టి నుంచో కాసుకు కూర్చుంది. ఇందులో భాగంగానే జ‌య‌ల‌లిత చ‌నిపోగానే శ‌శిక‌ళ‌ను అక్ర‌మాస్తుల కేసులో జైలుకు పంపింద‌ని చెబుతున్నారు.

ఇప్పుడు ర‌జ‌నీకాంత్‌కు ఉన్న అశేష అభిమానుల‌ను త‌న వైపుకు తిప్పుకోవవ‌డానికి ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీని ద్వారా వ‌చ్చే 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులో ల‌బ్ధి పొందొచ్చ‌ని మోడీ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. అన్నా డీఎంకే ఎలాగూ త‌మ మాట జ‌వ‌దాట‌దు కాబ‌ట్టి.. ర‌జ‌నీకాంత్‌ను కూడా మ‌చ్చిక చేసుకుంటే డీఎంకేకు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌వ‌వ‌చ్చ‌ని బీజేపీ యోచ‌న‌గా చెబుతున్నారు.

ఇందులో భాగంగానే కొద్ది రోజుల ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌లో భాగంగా ర‌జ‌నీకాంత్‌ను ఢిల్లీకి ఆహ్వానించింది. అక్క‌డ ర‌జనీకాంత్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ‌నాథ్ సింగ్ త‌దిత‌రుల‌తో భేటీ అయ్యారు. అంతేకాకుండా ఢిల్లీ నుంచి వ‌చ్చాక త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వితో భేటీ కావ‌డంతో ప‌లు ఊహాగానాలు చెల‌రేగాయి. ర‌జ‌నీ కూడా గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌సి బ‌య‌ట‌కు వ‌చ్చాక తామిద్ద‌రం రాజ‌కీయాల‌పై చ‌ర్చించామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి గణనీయ స్థానాలు సాధించడమే లక్ష్యంగా వ్యూహం రచించిన బీజేపీ.. ఆ మేరకు రజనీని రంగంలోకి దింపుతోందని విశ్లేష‌కులు అంటున్నారు. ఇందులో భాగంగానే రజనీకాంత్‌కి గవర్నర్‌ పదవి కట్టబెట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు స‌మాచారం.

మ‌రోవైపు ఓట‌మి భ‌యం, అనారోగ్య కార‌ణాలు త‌దిత‌రాల‌తో ఆదిలోనే రాజ‌కీయాల నుంచి వైదొల‌గిన ర‌జనీకాంత్ కు బీజేపీ ఆఫ‌ర్ న‌చ్చింద‌ని స‌మాచారం. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం ఏ పార్టీలో చేరాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డంతో ఆయ‌న ఇందుకు సై అంటార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే రజనీకాంత్ తమ పార్టీలో చేరకపోయినా గవర్నర్‌ పదవి ద్వారా ఆయన్ని తమ సొంతం చేసుకున్న‌ట్టేన‌ని బీజేపీ భావిస్తోంది. త‌ద్వారా ఆయన అభిమానులు బీజేపీకి కొమ్ము కాస్తార‌ని ఆ పార్టీ విశ్వ‌సిస్తోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే విఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాను ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో మంచి పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్న ర‌జ‌నీకాంత్, ఇళ‌య‌రాజా ద్వారా తాము అనుకున్న కార్యం నెర‌వేరుతుంద‌ని బీజేపీ గట్టి న‌మ్మ‌కంతో ఉంద‌ని చెబుతున్నారు.