Begin typing your search above and press return to search.

రాజీవ్‌... ప‌న‌గ‌రియాను మ‌రిపిస్తారా?

By:  Tupaki Desk   |   6 Aug 2017 9:19 AM GMT
రాజీవ్‌... ప‌న‌గ‌రియాను మ‌రిపిస్తారా?
X
న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప్ర‌ణాళికా సంఘాన్ని ర‌ద్దు చేసేసి... దాని స్థానంలో మ‌రింత క్రియాశీల‌కంగా ప‌నిచేసేందుకు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌లో కీల‌క మార్పు చోటుచేసుకుంది. నీతి ఆయోగ్ ఆలోచ‌న వ‌చ్చిన వెంట‌నే దాని నేతృత్వ బాధ్య‌త‌లు నెర‌వేర్చేందుకంటూ న‌రేంద్ర మోదీ ఏరికోరి తెచ్చుకున్న ప్ర‌ముఖ ఆర్థిక వేత్త అర‌వింద్ ప‌న‌గ‌రియా... మూడేళ్లు తిరక్కుండానే నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసేశారు. కొలంబియా యూనివ‌ర్సిటీలో పాఠాలు చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చిన ప‌న‌గ‌రియా... నీతి ఆయోగ్‌ కు మాత్రం సెకండ్ ప్రిఫ‌రెన్సే ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక న‌రేంద్ర మోదీ స‌ర్కారు... ప‌న‌గ‌రియా ఖాళీ చేయ‌నున్న ప‌ద‌వికి కొత్త వ్య‌క్తి వేట‌లో ప‌డిపోయింది.

ఈ క్ర‌మంలో ప‌లువురి అభ్య‌ర్థిత్వాల‌ను ప‌రిశీలించిన మోదీ సర్కారు... దేశీయ ఆర్థిక వ్య‌వ‌హారాల్లో సుదీర్ఘ కాలంగా త‌న‌దైన శైలిలో రాణిస్తున్న ప్ర‌ముఖ ఆర్థిక వేత్త రాజీవ్ కుమార్ ను నీతి ఆయోగ్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వికి ఎంపిక చేసింది. ప‌న‌గ‌రియా రాజీనామా చేసిన ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే మోదీ స‌ర్కారు రాజీవ్ అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇక రాజీవ్ ప్ర‌స్థానం విష‌యానికి వ‌స్తే... ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌ లో డీఫిల్ పట్టా అందుకున్నారు. లక్నో యూనివర్సిటీ నుంచి పీహెచ్‌ డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్)లో సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఫిక్కికి సెక్రటరీ జనరల్‌ గానూ పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (ఐసీఆర్ ఐఈఆర్)కు డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు జాతీయ భద్రతా సలహా బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.

ఐక్య‌రాజ్య‌స‌మితి - అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ త‌దిత‌ర అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో కీల‌క భూమిక పోషించిన ప‌న‌గ‌రియా... ప్రపంచ దేశాల్లోనే పేరెన్నిక‌గ‌న్న ఆర్థిక వేత్త‌గా ఎదిగారు. అయితే కేవ‌లం దేశీయ ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు మాత్రమే ప‌రిమిత‌మైన రాజీవ్ కుమార్‌... నీతి ఆయోగ్‌ ను ప‌న‌గ‌రియా మాదిరిగా న‌డుపుతారా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఆది నుంచి దేశీయ ఆర్థిక రంగంలోని ప‌లు కీల‌క విభాగాల్లో ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న రాజీవ్‌... ప‌న‌గ‌రియా కంటే కూడా నీతి ఆయోగ్‌ ను మెరుగ్గా న‌డిపిస్తార‌న్న భావ‌న కూడా వినిపిస్తోంది.