Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలా.. వద్దా.. సర్వే చేయిస్తున్న తలైవా

By:  Tupaki Desk   |   6 Nov 2020 3:00 PM IST
పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలా.. వద్దా.. సర్వే చేయిస్తున్న తలైవా
X
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం పై తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనను రాజకీయాల్లోకి రావాలని కొన్ని దశాబ్దాల నుంచి తమిళనాడు ప్రజలు కోరుతూ వచ్చారు. రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలిత హయాంలో ఎటువంటి రాజకీయ ప్రస్తావన రజనీ .. జయ మరణం తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు మూడేళ్ల కిందట ప్రకటించాడు. ఎన్నికల ముందు పార్టీ పెట్టాలనుకోగా కరోనా పరిస్థితులు ఆయన రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇప్పటికే కిడ్నీకి సంబంధించి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్న రజనీ.. ఈ కరోనా కాలంలో బయట తిరగడం అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తుండటంతో అసలు రాజకీయాల్లోకి రావాలా.. వద్దా. అనే దానిపై రజనీకాంత్ తీవ్ర గందరగోళంలో మునిగిపోయారు.

ఈ నేపథ్యంలో కిడ్నీకి చికిత్స చేయించుకోవడం, కరోనాకు ఇంకా టీకా రాకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారని, ఈ పరిస్థితుల్లో పార్టీ పెట్టలేనంటూ రజనీకాంత్ పేరుతో సోషల్ మీడియాలో విడుదలైన ఓ లేఖ సంచలనంగా మారింది. అయితే ఆ లేఖ నకిలీదని తాను రాసింది కాదని రజనీ ఖండించారు. అయితే అందులోని తన ఆరోగ్య పరిస్థితులు వాస్తవమేనని అంగీకరించారు. కరోనాకు టీకా వచ్చేంతవరకు రాజకీయాల్లోకి వెళ్లకపోవడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్న నేపథ్యంలో తాను ఇప్పటికిప్పుడు పార్టీ స్థాపించాలేనంటూ రజనీ పేర్కొన్నారు. రజనీ ప్రకటనతో రజనీ మక్కల్ మండ్రం నేతలు, అభిమానులు తీవ్ర నిరాశ లో మునిగిపోయారు. రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాల్సిందేనని వారు పట్టుబట్టారు.

ఈ నేపథ్యంలో తుగ్లక్ పత్రిక సంపాదకుడు గురు మూర్తి రజనీని కలసి రాజకీయాల్లోకి రావాలని కోరారు. దీంతో రజనీ అసలు రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ సంస్థల్లా కాకుండా ప్రజలను నేరుగా కలిసి తన రాజకీయ ప్రవేశంపై అభిప్రాయాలు సేకరించి నివేదికలు ఇవ్వాలని మక్కల్ మండ్రం నేతలకు రజనీకాంత్ సూచించారు. ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు జరుపనున్నారు. తుది నివేదికలు వచ్చిన తర్వాత మక్కల్ మండ్రం నేతలతో రజనీ సమావేశమై రాజకీయాలకి రావాలా.. వద్దా.. అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.