Begin typing your search above and press return to search.

త‌మ్ముడి కామెంట్ః ర‌జినీ రావాల్సిందే

By:  Tupaki Desk   |   13 Dec 2016 3:20 PM GMT
త‌మ్ముడి కామెంట్ః ర‌జినీ రావాల్సిందే
X
అమ్మ సెల‌వు తీసుకుని వెళ్లిపోయింది. క‌రుణానిధి కదిలే స్థితిలో లేడు. దీంతో త‌మిళనాట స‌రైన లీడ‌ర్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. డీఎంకేలో స్టాలిన్ అయినా.. అన్నాడీఎంకేలో ప‌న్నీర్ సెల్వం.. శ‌శిక‌ళ అయినా.. ముందుత‌రం నేత‌ల్ని భ‌ర్తీ చేసే ప‌రిస్థితి ఎంత‌మాత్రం లేదు. జయ‌.. క‌రుణ‌ల‌కు దీటైన జ‌నాద‌ర‌ణ ఉన్న నేత కోసం త‌మిళ ప్ర‌జానీకం ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయ అరంగేట్రానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నాడు ఆయ‌న సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ‌రావు గైక్వాడ్. కొన్నాళ్ల కింద‌ట ర‌జినీ రాజ‌కీయాల్లోకి రాడ‌ని వ్యాఖ్యానించిన వ్య‌క్తే.. ఇప్పుడు అన్న‌య్య‌ను రాజ‌కీయాల్లోకి ఆహ్వానిస్తున్నాడు.

త‌న కొత్త సినిమా ప‌ని పూర్తవ‌గానే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ర‌జినీ రాజ‌కీయాల్లోకి రావాలని స‌త్య‌నారాయ‌ణ‌రావు కోరాడు. ర‌జినీ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న డిమాండ్ ఈనాటిది కాదు. ఐతే ఓ ద‌శ‌లో రాజ‌కీయ అరంగేట్రానికి సానుకూలంగానే ఉన్న ర‌జినీ.. ఆ త‌ర్వాత వెన‌క్కి త‌గ్గాడు. తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని స్ప‌ష్టం చేశాడు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ర‌జినీ రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఆయ‌న చ‌క్రం తిప్ప‌గ‌ల‌ర‌ని.. ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించ‌గ‌ల‌ర‌ని రాజ‌కీయ పండితుల అంచ‌నా. డీఎంకే పార్టీకి కొంచెం మ‌ద్ద‌తుగా క‌నిపిస్తున్న ర‌జినీ.. ఆ పార్టీ ప‌గ్గాలు చేప‌డితే బాగుంటుంద‌న్న ఆశా ఆ పార్టీ వ‌ర్గాల్లో.. అభిమానుల్లో ఉంది. మ‌రోవైపు ర‌జినీని తురుపుముక్క‌లా వాడుకుని త‌మిళ‌నాట రాజ‌కీయ ఆధిప‌త్యం చ‌లాయించాల‌ని భాజ‌పా భావిస్తోంది. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/