Begin typing your search above and press return to search.

రజనీ రాజకీయాల్లోకి రారంటే రారు

By:  Tupaki Desk   |   27 Sept 2016 11:22 AM IST
రజనీ రాజకీయాల్లోకి రారంటే రారు
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చేశారు. తమిళనాట విశేష ప్రజాదరణ ఉన్న ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించే వారు భారీగానే ఉన్నారు. రాజకీయ పార్టీలు సైతం ఆయన్నుతమ జట్టులోకి లాక్కోవాలనే ప్రయత్నాలు చేశాయి. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్న మీమాంస సూపర్ స్టార్ లోనూ ఉంది. అదే తరచూ ఆయన రాజకీయ రంగప్రవేశం గురించి వార్తలు వచ్చేలా చేస్తుంటుంది. అయితే.. తన పొలిటికల్ ఎంట్రీ గురించి కానీ.. పాలిటిక్స్ గురించి కానీ రజనీకాంత్ విస్పష్టంగా చెప్పేసి ఉంటే మరోలా ఉండేది.

కానీ.. ఆయన ఆ పని చేయరు. సరే.. చేయకుంటే చేయకపోయారు.. సినిమాల్లో నర్మగర్భంగా డైలాగులు పెట్టటం ఎందుకు? అని ప్రశ్నించే వారికీ సమాధానం దొరకని పరిస్థితి. పలు రాజకీయ పార్టీ నేతలు రజనీతో భేటీ అయిన ప్రతిసారీ ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద చర్చ జరగటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలో తాజాగా రజనీ సోదరుడు సత్యనారాయణ.. రజనీ రాజకీయ రంగ ప్రవేశం మీద విస్పష్ట వ్యాఖ్య చేసేశారు. రజనీకాంత్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని కుండబద్ధలు కొట్టేశారు.

రామేశ్వరంలోని ఆలయాన్ని సందర్శించుకున్న రజనీ సోదరుడు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రజనీ రాజకీయ రంగ ప్రవేశం మీద వస్తున్న వార్తల్ని కొట్టిపారేస్తూ.. అందరికి స్పష్టత వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. రజనీకి ఆయన కుటుంబసభ్యులకు.. రాజకీయ రంగప్రవేశం మీద ఇసుమంతైనా ఆసక్తి లేదని తేల్చేశారు. రజనీ కేవలం సినిమాలు మాత్రమే చేస్తూ ఉంటారని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. ఇకనైనా రజనీ పొలిటికల్ ఎంట్రీ మీద వార్తలు ఆగిపోతాయా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/