Begin typing your search above and press return to search.

రాజేంద్రనగర్ బండ్ల గణేష్ కు దక్కేనా.?

By:  Tupaki Desk   |   10 Nov 2018 11:38 AM GMT
రాజేంద్రనగర్ బండ్ల గణేష్ కు దక్కేనా.?
X
మహాకూటమి పొత్తుల లెక్క దాదాపు ఖరారైందట.. కూటమిలో ఒక్కరే పోటీపడుతున్న సీట్లను రేపు విడుదల చేయనున్నట్టు సమాచారం. అదే సమయంలో టీడీపీ, టీజేఎస్ లకు కేటాయించే సెగ్మెంట్లపై రెండు మూడు రోజుల్లోనే స్పష్టత రానుంది.

ముఖ్యంగా హైదరాబాద్ చుట్టపక్కల స్థానాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి మహేశ్వరం టికెట్ ఖారారైనట్టు సమాచారం. ఆమె కుమారుడికి మాత్రం సీటు లేదని ప్రచారం జరుగుతోంది. ఒక కుటుంబానికి ఒకటే సీటు అన్న కాంగ్రెస్ నిర్ణయం ప్రకారం సబితకు ఇచ్చినట్టు సమాచారం. ఇక కొడంగల్ రేవంత్ రెడ్డికి , పరిగి రామ్మోహన్ రెడ్డికి, కల్వకుర్తి వంశీచంద్ రెడ్డి అభ్యర్థిత్వాలకు ఆమోద ముద్ర పడిందట..ఎల్ బీ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ , షాద్ నగర్ లకు కూన శ్రీశైలం గౌడ్, చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలను ఒకే చేసినట్లు సమాచారం.

వికారాబాద్ పై సస్పెన్స్ వీడింది. ఇక్కడ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు టికెట్ ఖారారైనట్టు సమాచారం. ఇదే టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ కు మరో చోట సీటు ఇవ్వాలని అధిష్టానం చర్చలు జరుపుతోందట.. తాండూర్ నుంచి పైలెట్ రోహిత్ రెడ్డి, మేడ్చల్ నుంచి మాజీ ఎమ్మెల్యే కేఎల్ ఆర్ పేరుకు ఆమోదముద్ర పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మేడ్చల్ నుంచి టీజేఎస్ తరఫున సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇటీవల టీజేఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కోదండరాం ఈ సీటును తమకు ఇచ్చేయాలని కోరుతున్నారు.

ఇబ్రహీం పట్నం అభ్యర్థిపై తేలడం లేదు. మల్ రెడ్డి రంగారెడ్డి, సోదరుడు రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి లాబీయింగ్ చేస్తున్నారు.

ఇక అన్నింటికంటే ఆసక్తి రేపు అంశం కాంగ్రెస్ లో ఇటీవలే చేరిన సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఎక్కడ సీటు వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. రాజేంద్రనగర్ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. కమ్మ సామాజికవర్గ గణేష్ కోసం మాజీ ఎంపీ లగడపాటి, మరికొందరు నేతలు పావులు కదుపుతున్నారట.. కానీ ఇక్కడే సబిత తనయుడు కార్తీక్ రెడ్డి కూడా తనకే సీటు కావాలని పోటీపడడం బండ్ల గణేష్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.