Begin typing your search above and press return to search.

రాజీవ్ హత్య : గవర్నర్ మెడకే చుట్టేస్తున్నారే !

By:  Tupaki Desk   |   4 Jan 2020 5:48 AM GMT
రాజీవ్ హత్య : గవర్నర్ మెడకే చుట్టేస్తున్నారే !
X
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హంతకుల విడుదల కోసం ఏకంగా రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ని రాష్ట్రం నుండి పంపేయాలని చూసిన వారి ప్రయత్నాలని హైకోర్టు అడ్డుకుంది. గవర్నర్ పై వేసిన రీకాల్ పిటిషన్‌ ను మద్రాసు హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. అసలు విషయం ఏమిటంటే .. రాజీవ్‌గాంధీ హత్యకేసులో ప్రధాన నిందుతులుగా ఉన్న నళిని, మురుగన్, పేరరివాళన్, రాబర్ట్‌పయాస్, జయకుమార్, శాంతన్, రవిచంద్రన్‌.. ఈ ఏడుగురు ఖైదీలు వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి తొలుత ఉరిశిక్ష ని ఖరారు చేయగా , ఆ తరువాత దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చారు.

యావజ్జీవ ఖైదీలుగా 28 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. వారిని విడుదల చేయాలని కోరుతూ గతంలో కొందరు వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టు సానుకూలం గా ఒకింత స్పందించింది. ఖైదీల విడుదల అంశంపై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ విచక్షణకు వదిలేసింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోగా వారి విడుదలకు అనుకూలంగా అసెంబ్లీలో ఆమె తీర్మానం చేశారు. సదరు ఫైల్‌ను సుమారు నాలుగేళ్ల క్రితమే గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. కానీ , ఆ ఫైల్ అక్కడి నుండి మాత్రం ఎన్ని సమీక్షలు , సమావేశాలు జరుగుతున్నా కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేదు. అలాగే మరోసారి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సైతం 2018 సెప్టెంబర్‌ 9వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌ బంగ్లాకు పంపారు. దీనిపై సుమారు రెండున్నరేళ్లపాటు గవర్నర్‌ అనేక విడతలుగా రాజీవ్‌ హంతకుల విడుదల అంశంపై సమీక్షలు జరిపారు. ఆ తరువాత దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పకుండా కాలం గడుపుతున్నారు. దీనితో ఆ ఏడుగురు ఖైదీల విడుదల విషయం దాదాపూ మూలపడిందనే చెప్పాలి.

దీనితో అసెంబ్లీ మంత్రి వర్గ తీర్మానానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన గవర్నర్‌ భన్వారీరాల్‌ రాజ్యాంగాన్ని ధిక్కరించినందున అతడిని రీకాల్‌ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చెన్నై కున్రత్తూరుకు చెందిన తందైపెరియార్‌ ద్రావిడ కళగం కాంచీపురం జిల్లా అధ్యక్షుడు కన్నదాసన్‌ ఇటీవల మద్రాసు హైకోర్టు లో పిటిషన్‌ వేశారు. రాజ్యాంగశాసనాలను ధిక్కరించే విధంగా భన్వారీలాల్‌ వ్యవహరిస్తున్నందున న్యాయస్థానం జోక్యం చేసుకుని గవర్నర్‌ బాధ్యతల నుంచి ఆయనను తప్పించేలా ఉత్తర్వులు జారీచేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ విచారణకు అర్హమైనది కాదని న్యాయమూర్తులు సత్యనారాయణన్, హేమ లతతో కూడిన ధర్మాసనం తెలిపింది. మంత్రివర్గం చేసిన తీర్మానాలపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌ కు గడవు అంటూ ఉండదని గతంలోనే కోర్టు స్పష్టం చేసిందని, రాష్ట్రపతి చే నియమితులైన గవర్నర్‌ ను తొలగించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించలేమని తెలియ జేస్తూ పిటిషన్‌ ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది.