Begin typing your search above and press return to search.

గెహ్లాట్ కు బిగుసుకున్న మరో వివాదం

By:  Tupaki Desk   |   2 Oct 2022 4:06 AM GMT
గెహ్లాట్ కు బిగుసుకున్న మరో వివాదం
X
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తనకు సచిన్ పైలెట్ కు మధ్య జరుగుతున్న సీక్రెట్ వార్ కు సంబంధించిన ఒక లెటర్ లీకవ్వటంతో ఒక్కసారిగా గోల పెరిగిపోయింది. గెహ్లాట్-సచిన్ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటున్న విషయం తెలిసిందే. తన స్ధానంలో సీఎంగా సచిన్ను ఎట్టి పరిస్ధితుల్లోను కానీయకూడదని గెహ్లాట్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ప్రయత్నంలోనే సీఎం చేసిన ఓవర్ యాక్షన్ సోనియాగాంధితో పాటు సీనియర్లందరికీ బాగా చికాకు తెప్పించింది. దీని కారణంగానే కాంగ్రెస్ అధ్యక్షుడిగా నామినేషన్ వేయాల్సిన సీఎంను సోనియా చివరి నిముషంలో దూరంగా పెట్టేశారు. రేపు ముఖ్యమంత్రి పదవి ఉంటుందో లేదో కూడా అనుమానంగానే ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లోనే సచిన్ కు వ్యతిరేకంగా గతంలోనే గెహ్లాట్ అధిష్టానానికి రాసిన లేఖ ఇపుడు బయటపడింది. అధిష్టానానికి రాసిన లేఖలో సచిన్ పైలెట్ ను గెహ్లాట్ ఎస్పీ అని సంబొధించారు.

తన లేఖలో ఎస్పీ గురించి రాస్తు సచిన్ రాజస్ధాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో బీజేపీతో కుమ్మకై ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాగే ఎంఎల్ఏలను కొనేందుకు తలా రు. 50 కోట్లు ఆఫర్ చేసినట్లు కూడా రాశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్పీ పార్టీని వదిలేసేందుకు కూడా వెనకాడరని ఘాటుగా చెప్పారు. తనకు 102 మంది ఎంఎల్ఏల మద్దతుంటే ఎస్పీకి కేవలం 18 మంది ఎంఎల్ఏల మద్దతు మాత్రమే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.

అధిష్టానానికి గెహ్లాట్ రాసిన లేఖ బయటపడటంతో సచిన్ తో పాటు తన వర్గం ఎంఎల్ఏలంతా మండిపోతున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే సచిన్ను సీఎం అవమానిస్తున్నట్లు మండిపోతున్నారు. పైలెట్ ను సీఎం కానీకుండా అడ్డుకోవటమే టార్గెట్ గా గెహ్లాట్ ఇలాంటి చవకబారు చేష్టలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఎవరెటువంటి వాళ్ళో అధిష్టానానికి అంతా తెలుసని సచిన్ వర్గం గట్టిగా సమాధానం చెబుతున్నారు.