Begin typing your search above and press return to search.

కడుపులో ఉన్నదంతా ఆ సీఎం ఇప్పుడే కక్కేశాడంటే.. లెక్క తేడా వచ్చినట్లేనా?

By:  Tupaki Desk   |   21 July 2020 3:30 AM GMT
కడుపులో ఉన్నదంతా ఆ సీఎం ఇప్పుడే కక్కేశాడంటే.. లెక్క తేడా వచ్చినట్లేనా?
X
ఒక రాష్ట్రం తర్వాత.. మరో రాష్ట్రం. యావత్ దేశంలో కాంగ్రెస్ తప్ప మరే పార్టీ కూడా పవర్లో ఉండకూదన్న పట్టుదల అప్పటి కాంగ్రెస్ లో ఎంతలా ఉండేదో తెలిసిందే. ఇందిరమ్మ.. రాజీవ్ ల హయాంలో దేశంలో మరే పార్టీని అధికారంలోకి రానిచ్చే వారు కాదు. ఒకవేళ ప్రజాబలంతో వచ్చినా.. దాన్ని ఏదోలా సాగనంపే వరకూ నిద్ర పట్టని రీతిలో ఉండేది. ఇందుకోసం అవసరమైతే ఏ బాటలో నడవటానికైనా సిద్ధపడేది కాంగ్రెస్ అధినాయకత్వం. చేసిన పాపం ఊరికే పోదుగా?

అప్పుడెప్పుడో చేసిన దానికి ఇప్పుడు వడ్డీతో సహా ఆ పార్టీ చెల్లిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎలాంటి ఆశ ఉండేదో.. ఇప్పుడు మోడీషాలు అలాంటి వ్యూహాల్నే రచిస్తున్నారు. తమకు ఏ మాత్రం పట్టు చిక్కినా.. సదరు రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తూ.. కాషాయ దన్నుతో ప్రభుత్వం ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు కాస్త ముందుగా మధ్యప్రదేశ్ ను టార్గెట్ చేయటం.. మిషన్ ఫినిష్ చేయటం అంతకు ముందు కర్ణాటక.. దానికి కాస్త ముందు బిహార్ లాంటి ఎపిసోడ్లు చూసినప్పుడు మోడీషాల చాణుక్యం కాంగ్రెస్ పార్టీ నాటి నాయకత్వాన్ని గుర్తు చేయక మానదు.

తాజాగా మిషన్ రాజస్థాన్ పేరుతో నిర్వహిస్తున్నవైనం కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలంగా పవర్ కోసం ఎదురుచూస్తున్న సచిన్ పైలెట్ ను తాము అనుకున్న దారిలోకి తీసుకురావటమే కాదు.. అతడు నడిపిస్తున్న కథకు కేంద్రం దన్నుగా నిలుస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చూసేందుకు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంలా కనిపిస్తున్నా.. దాని వెనుక ఎవరున్నారన్నది బహిరంగ రహస్యమే.

సచిన్ పైలెట్ ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. అంతిమంగా తమదే అధికారం అన్నట్లుగా మాట్లాడిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా బరస్ట్ అయ్యారు. అది కూడా ఎంతలా అంటే.. గడిచిన కొద్దికాలంగా పెద్ద మనిషి కడుపులో ఓపిగ్గా దాచినదంతా కక్కేశారు. పైలెట్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయనపై ఘాటైన పదజాలంతో మండిపడ్డారు.

అతనికి అర్హత లేదని.. ఒకరితో ఒకరికి కోట్లాటలు పెట్టటం మినహా చేసిందేమీ లేదన్న ముఖ్యమంత్రి.. పైలట్ ది అమాయకమైన ముఖం కావటం.. హిందీ.. ఇంగ్లిషులో బాగా మాట్లాడటంతో మీడియాను బాగా ఆకర్షించారన్నారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు ఏమిటో రాజస్థాన్ ప్రజలకు తెలుసన్న గెహ్లాట్.. పార్టీ ప్రయోజనాల కోసమే ఆయన తీరును తానెప్పుడు ప్రశ్నించలేదన్నారు.

గడిచిన ఆర్నెల్లుగా పైలట్ కుట్ర చేస్తున్నాడని.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు. తాను ఎంత చెప్పినా నమ్మలేదన్న ఆయన.. ఇంత అమాయకంగా కనిపించే వ్యక్తి అలా చేస్తాడని ఎవరూ ఊహించలేదన్నారు. ఎమ్మెల్యేలంతా ఆయన నిర్బంధంలో ఉన్నారని.. ఎమ్మెల్యేలు తమ పరిస్థితి గురించి తనకు ఫోన్ చేసి వాపోతున్నారన్నారు. వారి చేతుల్లోని మొబైల్స్ లాక్కున్నట్లుగా గెహ్లాట్ వాపోయారు. నిన్నటి వరకూ బింకంగా మాట్లాడి.. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామన్న ముఖ్యమంత్రి నోటి నుంచి ఇప్పుడీ మాటలు రావటం చూస్తే.. లెక్క ఏదో తేడా కొడుతున్నట్లు అనిపించట్లేదు?