Begin typing your search above and press return to search.

ఐపీఎల్ నా తండ్రి ప్రాణాలనే కాపాడింది.. రాజస్థాన్ బౌలర్ భావోద్వేగ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 May 2021 2:49 AM GMT
ఐపీఎల్ నా తండ్రి ప్రాణాలనే కాపాడింది.. రాజస్థాన్ బౌలర్  భావోద్వేగ వ్యాఖ్యలు
X
గత ఏడాది దేశంలో కరోనా వ్యాప్తి చెందడంతో ఐపీఎల్ లీగ్ ను యూఏఈలో నిర్వహించారు. అయితే ఈ ఏడాది దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ టోర్నమెంట్ దేశంలోని నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయించారు. ఆటగాళ్లు అందర్నీ బయో బబుల్ లో ఉంచి సేఫ్ గా టోర్నమెంట్ నిర్వహించవచ్చని భావించారు. అయితే ఆరంభంలో ఐపీఎల్ నిర్వాహకులు భావించినట్లు గానే అంతా సజావుగా జరిగింది. దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఐపీఎల్ ఆటగాళ్లు ఎవరికీ కరోనా సోకలేదు. అయితే ఆ తర్వాత దేశంలో కరోనా తీవ్రత ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది.

రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య నాలుగు లక్షలకు పైగా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించడం అంత అవసరమా.. అని పలువురు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఐపీఎల్ కోసం అనవసరంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కరోనా బయో బబుల్ ను ఛేదించింది. ముందుగా కోల్ కతా ఆటగాళ్లకు వైరస్ సోకింది. ఆ తర్వాత చెన్నై జట్టు సిబ్బందికి, సన్ రైజర్స్ ఆటగాడు సాహాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో ఐపీఎల్ లీగ్ నిర్వహణ ఇక కష్టమే.. అని భావించిన నిర్వాహకులు టోర్నమెంట్ ను నిరవధికంగా వాయిదా వేశారు.

అయితే ఐపీఎల్ నిర్వహణపై అంతటా విమర్శలు వచ్చినప్పటికీ ఐపీఎల్ తన తండ్రి ప్రాణాన్ని కాపాడిందని రాజస్థాన్ ప్లేయర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ లోని భావ్ నగర్ కు చెందిన 23 ఏళ్ల ఎడమ చేతి వాటం బౌలర్ చేతన్ సకారియాను రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. సకారియా ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. కరోనా తీవ్రతరం అవడంతో లీగ్ వాయిదా పడగా సకారియా సొంతూరుకు చేరుకున్నాడు.కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తన తండ్రి బాగోగులు చూసుకుంటున్నాడు.

ఐపీఎల్ నిర్వహించడం పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో సకారియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ' కరోనా బారిన పడటంతో నా సోదరుడు మరణించాడు. ఆ తర్వాత తన తండ్రికి కూడా వైరస్ సోకి ఆస్పత్రిలో చేరాడు. నేను ఈ ఏడాది ఐపీఎల్ ఆడగా వచ్చిన డబ్బుతో మా నాన్నకు ట్రీట్ మెంట్ ఇప్పించి బతికించుకున్నాను. ఐపీఎల్ ను విమర్శించే వాళ్లకు నేను ఒకటే చెబుతున్నా. ఐపీఎల్ నా తండ్రి ప్రాణాలు కాపాడింది. నా కుటుంబాన్ని పోషిస్తోంది' అని ఐపీఎల్ పై భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు.