Begin typing your search above and press return to search.

రంజాన్ వేళ అలా మాట్లాడరేం సీపీసాబ్?.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 Nov 2019 5:00 AM GMT
రంజాన్ వేళ అలా మాట్లాడరేం సీపీసాబ్?.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X
కొన్ని అంశాల్ని టచ్ చేయకుండా ఉండటానికి మించింది లేదు. ఆచితూచి అన్నట్లు వ్యవహరించే రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు వివాదంగా మారటమే కాదు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.


అయ్యప్ప మాల వేసుకునే పోలీసు ఉద్యోగులకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని.. ఒకవేళ మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టాలని పోలీసులు ఎవరైనా అనుకుంటే.. వారంతా సెలవుల పై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాలు జారీ చేసిన తీరును రాజాసింగ్ తప్పు పట్టారు.

అయ్యప్ప మాట వేసుకుంటే డ్యూటీకి రావొద్దని.. గడ్డం పెంచటం.. షూ వేసుకోకుండా ఉండటం.. ఖాకీ డ్రెస్ మీద నల్ల కండువా వేసుకోవటం లాంటివేమీ చేయకూడదని మెమో జారీ చేయటాన్ని ఆయన తప్పు పట్టారు. అయ్యప్ప మాట వేసుకొని డ్యూటీకి రావొద్దని మెమో జారీ చేయటం ఏమిటి? రంజాన్ వేళ ఇలాంటి మెమోలు విడుదల చేయాలని అన్పించలేదా? అని క్వశ్చన్ చేశారు.

హిందువులకు ఒక చట్టం.. ముస్లింలకు ఒక చట్టమా? రంజాన్ మాసంలో ముస్లింలకు ఎలాంటి స్వేచ్ఛను ఇస్తారో.. హిందువులకు అలాంటి వెసులుబాటునే ఇవ్వాలన్నారు. ఎవరి మాటతో ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నారు? ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సీఎం నుంచి వచ్చాయా? మజ్లిస్ ఆఫీసు నుంచి మెమో రిలీజ్ అయితే అందరికి దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

రంజాన్ వేళలో టోపీలు..గడ్డాలు తీసేయాలని మెమోలు జారీ చేయగలరా?అని ప్రశ్నించారు. అయ్యప్ప మాల వేసుకునే వారికి స్వేచ్ఛ ఇవ్వాలని.. లేదంటే జరిగే పరిణామాలకు సీపీ బాధ్యత వహించాలన్నారు. అయ్యప్ప మాల వేసుకునే వారు తప్పనిసరిగా యూనిఫారం వేసుకోవాల్సిందేనని రాచకొండ సీపీ ప్రత్యేక మెమో జారీ చేసిన వేళ.. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నమ్మకాలను అందరికి ఒకేలా ఉండాలే కానీ.. వేర్వేరుగా ఉండకూడదన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు.

అయ్యప్ప మాల వేసుకునే వారికి ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఇవ్వరని.. యూనిఫాం.. షూస్ లేకుండా విధి నిర్వహణ సాధ్యం కాదని.. అలాంటివారంతా సెలవు తీసుకోవాలన్న మెమో జారీ చేయటం తెలిసిందే. ఇలాంటివేళ బీజేపీ ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ గళం విప్పారు. మరి.. దీనికి రాచకొండ సీపీ ఏమని బదులిస్తారో చూడాలి.