Begin typing your search above and press return to search.

రెవెన్యూ చట్టంపై కీలక పాయింట్ ఎత్తి చూపిన రాజాసింగ్

By:  Tupaki Desk   |   12 Sept 2020 10:15 AM IST
రెవెన్యూ చట్టంపై కీలక పాయింట్ ఎత్తి చూపిన రాజాసింగ్
X
తాను ఏదైనా అనుకుంటే..దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గని తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో చాలా ఎక్కువ. అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తూ.. తరచూ పలు వివాదాలకు నెలువుగా ఉండే రెవెన్యూ వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాలన చేయటంతో పాటు..కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న కేసీఆర్ ఆలోచన ఇప్పటిది కాదు. మొత్తంగా తాను అనుకున్నట్లే కొత్త చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

తాజాగా దీనిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. కొత్త చట్టాన్ని స్వాగతిస్తూనే.. పలు ప్రశ్నల్ని సంధించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర ప్రశ్నను సంధించారు. కొత్త రెవెన్యూ చట్టంలో వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి.. తహసీల్దార్లపై భారం వేయటం ఎంతమేర సమంజసం? అని ప్రశ్నించిన ఆయన.. వీర్వోలే కాదు తహసీల్దార్లు కూడా అవినీతి దుకాణం తెరిచిన వైనాన్ని ప్రస్తావించారు.

కొందరు వీఆర్వోలు చేసిన తప్పులకు అందరిపై అవినీతి ముద్రవేయటం సరికాదన్న రాజాసింగ్ మరో కీలకమైన క్వశ్చన్ వేశారు. వీఆర్వోలు చేసిన తప్పులే తహసీల్దార్లు చేయరని గ్యారెంటీ ఏమిటి? అంటూ కీలకమైన వాదనను వినిపించారు. తాజాగా అదనపు కలెక్టర్లే పట్టుబడుతున్న వైనాన్ని ప్రస్తావించారు. అధికారుల్ని మార్చే కన్నా.. వ్యవస్థను మార్చాలన్న రాజాసింగ్.. రైతుల నుంచి డబ్బులు అడిగే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు రావాలన్నారు.

వ్యవసాయ భూముల్ని సర్వే చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారని.. మరి.. దేవాదాయ.. ల్యాండ్ సీలింగ్ భూముల్ని కూడా సర్వే చేస్తారా? అన్న సందేహాల్ని వ్యక్తం చేశారు. కొత్త రెవెన్యూ చట్టంపై మద్దతు తెలిపిన రాజాసింగ్ లేవనెత్తిన కీలక పాయింట్లకు ముఖ్యమంత్రి ఏమని బదులిస్తారన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.