Begin typing your search above and press return to search.

లాంఛ‌నం పూర్తి!..క‌డ‌ప గ‌డ‌ప‌లో టీడీపీ జీరో!

By:  Tupaki Desk   |   31 Jan 2019 11:00 PM IST
లాంఛ‌నం పూర్తి!..క‌డ‌ప గ‌డ‌ప‌లో టీడీపీ జీరో!
X
నిజ‌మే. లాంఛ‌నం పూర్తి అయ్యింది. క‌డ‌ప గ‌డ‌ప‌లో అధికార పార్టీ టీడీపీ జీరోగా మారింది. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏ చోట మొద‌లెట్టి... ఏ చోట ముగించినా కూడా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లో టీడీపీ జీరోగానే మారిపోయింద‌ని చెప్ప‌క తప్ప‌దు. క‌డ‌ప జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి నేటి మ‌ధ్యాహ్నం లాంఛ‌నంగా వైసీపీలోకి చేరిపోయారు. టీడీపీ టికెట్‌పై త‌న‌కు ద‌క్కిన ఎమ్మెల్యే గిరీ రాజీనామా చేసి మ‌రీ... మేడా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరాలంటే... ఇత‌ర పార్టీల టికెట్ల‌పై అందిన ప‌ద‌వికి రాజీనామా చేసి రావాల్సిందేన‌ని చెప్పిన జ‌గ‌న్ మాట‌కు క‌ట్టుబ‌డిన మేడా... ఆ మేర‌కు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి స్పీక‌ర్ ఫార్మాట్‌ లోనే రాజీనామా చేసి పారేశారు. ఆ త‌ర్వాత నేరుగా జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లిన మేడా వైసీపీలోకి చేరిపోయారు. అధికార పార్టీ టికెట్ పై ద‌క్కిన ఎమ్మెల్యే గిరీని తృణ‌ప్రాయంగా వ‌దిలేసి వ‌చ్చిన మేడాకు జ‌గ‌న్ సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు. మొత్తంగా వైసీపీలోకి మేడా చేరిక‌కు సంబంధించి లాంఛ‌నం కూడా పూర్తి అయ్యింద‌న్న మాట‌.

ఈ లాంఛ‌నం పూర్తి అయిన తర్వాత తేలిన లెక్క‌ల ప్ర‌కారం... క‌డ‌ప జిల్లాలో టీడీపీకి గుండు సున్నానే మిగిలింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా ఫ‌లితాల‌ను చూస్తే... మొత్తం ప‌ది అసెంబ్లీ సీట్ల‌కు 9 స్ధానాల‌ను గెలిచేసిన వైసీపీ, రెండు పార్లమెంటు సీట్ల‌లోనూ జ‌య‌కేతనం ఎగుర‌వేసింది. టీడీపీకి సింగిల్ సీటు మాత్ర‌మే ల‌భించింది. అదే రాజంపేట అసెంబ్లీ సీటు. అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మేడా... వైసీపీ అభ్య‌ర్థి అమ‌ర్‌ నాథ‌రెడ్డిపై 11,615 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఆ త‌ర్వాత చంద్ర‌బాబు విసిరిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు ప‌డిపోయిన జ‌మ్మ‌ల‌మడుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి - బ‌ద్వేలు ఎమ్మెల్యే జ‌య‌రాములు టీడీపీలో చేరిపోయారు. అయితే వారిద్ద‌రూ వైసీపీ టికెట్ల‌పై అందిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండానే టీడీపీలో చేరారు. ఈ నేప‌థ్యంలో రికార్డుల ప‌రంగా ఇప్ప‌టికీ వారు వైసీపీ ఎమ్మెల్యేలే. అసెంబ్లీ రికార్డులే ఇందుకు నిద‌ర్శ‌నం.

త‌మ పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఆదినారాయ‌ణ‌రెడ్డి, జ‌య‌రాములు స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేయాల‌ని వైసీపీ ఎన్ని సార్లు కోరినా... స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ పెడ‌చెవినే పెట్టారు. అధికార పార్టీ ర‌చించిన వ్యూహం ప్ర‌కార‌మే స్పీక‌ర్ వీరిపై చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. దీంతో జిల్లాలోని 9 సీట్లు ఇప్ప‌టికీ వైసీపీ పేరిటే ఉండ‌గా... మిగిలిన టీడీపీ సీటు ఖాళీ కావ‌డంతో... జిల్లాలో టీడీపీ జీరోగానే మారిపోయిందని చెప్పాలి. మేడా రాజీనామాను స్పీక‌ర్ ఆమోదించ‌క‌పోయినా.. కూడా స్పీక‌ర్ ఫార్మాట్‌ లో చేసిన ఆ రాజీనామాను... రాజీనామాగానే ప‌రిగ‌ణించ‌క త‌ప్ప‌దు. మొత్తంగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు సంబంధించి క‌డ‌ప జిల్లాలో ద‌క్కిన ఒక్క సీటు కూడా రాజీనామాగా నిల‌వ‌డంతో క‌డ‌ప జిల్లాలో టీడీపీ జీరోగానే మారింద‌న్న విశ్లేష‌ణలు వినిపిస్తున్నాయి.