Begin typing your search above and press return to search.

జుట్టే లేదనుకున్నా.. బుర్ర కూడా లేదే.. గల్లాపై తీవ్ర విమర్శలు

By:  Tupaki Desk   |   8 Feb 2020 3:00 PM IST
జుట్టే లేదనుకున్నా.. బుర్ర కూడా లేదే.. గల్లాపై తీవ్ర విమర్శలు
X
ట్విటర్ వేదికగా ఇద్దరు ఎంపీలు దూషించుకున్నారు. ఒకరిని మించి మరొకరు దూషణలు చేసుకున్నారు. ఇప్పుడు అవి ఏకంగా వ్యక్తిగత విమర్శలకు దారితీశాయి. దీనికి కియా తరలింపు అసత్య వార్త ఆజ్యం పోసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి లోక్ సభలో చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎద్దేవా చేస్తూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. 1947లో ఏర్పాటు చేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ను డమ్మీ కంపెనీగా వ్యాఖ్యానించడం ఎంపీ మిథున్ రెడ్డి అవివేకం, బాధ్యతారాహిత్యమని గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ కంపెనీ ఇండియాలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే రాష్ట్రం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ చూసిన ఎంపీ మిథున్‌ రెడ్డి దీటుగా బదులిచ్చారు. ‘‘మీ తలపై వెంట్రుకలే లేవనుకున్నా.. ఇప్పుడే తెలిసింది, మెదడు కూడా లేదని’’ అని వ్యంగ్యంగా విమర్శించారు. ఏపీ నుంచి పెట్టుబడిదారులు వెళ్లిపోవాలంటూ ఎందుకు వెంటబడతావు? అని ప్రశ్నించారు. అవివేకి, బాధ్యతారాహిత్యుడు మీరేనని గల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ విమర్శలపై గల్లా జయదేశ్ మండిపడ్డారు. తన శరీరం, తెలివితేటలపై మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజలకే వదిలేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎవరు గెలిచారో ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా పెట్టుబడిదారులను ఎవరు బెదిరిస్తున్నారో, వెంటబడుతున్నారో చెప్పాలని ప్రశ్నిస్తూ కియా ప్రారంభోత్సవం లో ఆ కంపెనీ ప్రతినిధి ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరిస్తున్నట్లు ఉన్న ఫొటోను పంచుకున్నారు.

కియాకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానమంటూ కియా ప్రకటనను ఎంపీ మిథున్‌రెడ్డి జోడించారు. ఏపీ నుంచి ఎక్కడికీ వెళ్లట్లేదని కియా మోటర్స్ ప్రకటించిందని తెలిపారు. ఈ వ్యవహారం పై తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారని గల్లా జయదేవ్‌ను ప్రశ్నించారు. ఎంపీగా బాధ్యతగా మెలగాలనే విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. కియా ఎక్కిడికీ వెళ్లట్లేదంటూ మిథున్‌ రెడ్డి జోడించిన క్లిప్పింగ్‌ ను గల్లా జయదేవ్ కొట్టి పారేశారు. ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి సేల్స్ హెడ్ అని తెలిపారు. ఇలాంటి కీలకమైన విషయాలను సీఈఓ లేక ఎండీ స్పందిస్తేనే విలువ ఉంటుందని స్పష్టం చేశారు. ఓసారి బెదిరింపులకు గురైన వ్యక్తి ఇచ్చే ప్రకటన చెల్లబోదని వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఇద్దరు ఎంపీలు ట్విటర్ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.