Begin typing your search above and press return to search.

సీమలో చంద్రన్నకు కష్టాలే కష్టాలు!!

By:  Tupaki Desk   |   14 July 2018 8:00 PM IST
సీమలో చంద్రన్నకు కష్టాలే కష్టాలు!!
X
తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ప్రాంతంలో గత ఎన్నికల కంటే కూడా ఈసారి మరిన్ని కష్టాలు తప్పవని తెలుస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన నేతలను పార్టీలోకి తీసుకురావడం ఒక కారణం కాగా.. అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతలు నాలుగైదు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాడుకుంటుండడం మరో కారణం. ఈ నేపథ్యంలోనే టిక్కెట్లు వస్తాయన్న నమ్మకం లేని నేతలు.. ఈ గ్రూపు రాజకీయాల్లో ఇమడలేకపోతున్నవారు వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

తాజాగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పేరు వార్తల్లో నానుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు వద్ద గౌరవం దక్కడం లేదని.. అవమానాలు ఎదుర్కోవడం తన వల్ల కాదని ఆయన కార్యకర్తల వద్ద ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. పలు ఇతర కారణాలూ తోడవడంతో ఆయన టీడీపీని వీడటానికే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాజంపేట సీటును త్రుటిలో కోల్పోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు టీడీపీలోని ఈ లుకలుకలు వైసీపీకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. మేడా వచ్చి చేరినా - చేరకపోయినా విజయం తమదే అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

ఇంతకుముందు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి పేరు కూడా వినిపించింది. ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి చేరనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. త్వరలో ఆయన చేరికపైనా క్లారిటీ వస్తుందని సమాచారం.