Begin typing your search above and press return to search.

పదేళ్లుగా పోరాటం చేస్తున్న రాజయ్య కోడలు

By:  Tupaki Desk   |   4 Nov 2015 6:33 AM GMT
పదేళ్లుగా పోరాటం చేస్తున్న రాజయ్య కోడలు
X
మాజీ ఎంపీ రాజయ్య కుమారుడు అనిల్ - నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన సారిక ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో 2002లో హైదరాబాదులో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ గా పని చేస్తున్న సారిక ఉద్యోగరీత్యా లండన్ వెళ్ళి 2005లో తిరిగొచ్చారు. ఆ సమయంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అనిల్‌ కు వివాహేతర సంబంధం ఉందని తెలిసి సారిక నిలదీయడంతో గొడవలు మొదలయ్యాయని చెబుతున్నారు స్థానికులు. అత్తింటి వాళ్లు తనను అస్సలు పట్టించుకోవడం లేదని, పిల్లల పోషణ కూడా భారంగా మారిందని, తనకు న్యాయం చేయమంటూ సారిక 2014 ఏప్రిల్‌లో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్‌ ఆదేశాలతో బేగంపేట మహిళా పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైంది. ఆమె కేసు పెట్టడం కోసం హైదరాబాద్‌ వెళ్ళి తిరిగి వచ్చేసరికి వరంగల్‌ లోని రాజయ్య ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో సారిక ఇంటి ముందే ఆందోళనకు దిగారు.

మొదట్లో సఖ్యతగా ఉన్న తన భర్త తర్వాత మానసికంగా వేధించేవాడని అప్పట్లో ఆరోపించారు సారిక. తాను గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు యత్నించానని, అయినప్పటికీ వారిలో మార్పు రాలేదని తెలిపారు. సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌ గా సంపాదించిన సొమ్మంతా భర్తకే ఇచ్చానని, పిల్లల పోషణ కూడా ఇబ్బందిగా ఉందని, కనీసం వాళ్లకు కావాల్సిన పాలడబ్బాలు - మందులు కొనేందుకు డబ్బుల్లేవని అప్పట్లో గోడు వెళ్ళబోసుకున్నారు రాజయ్య కోడలు. స్థానికులు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాజయ్య ఎంపీ అయ్యాకే తన మీద వేధింపులు పెరిగాయని అప్పట్లో ఆరోపించారు సారిక. ఇప్పుడు కూడా సరిగ్గా ఆయన నామినేషన్‌ వేసే సమయంలోనే ఘోర విషాదకర సంఘటన జరిగింది.

రాజయ్య కుటుంబమే సారికను హత్య చేసిందని ఆమె తల్లి లలిత - సోదరి అర్చన ఆరోపిస్తున్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని చెబుతున్నారు. ఆరేళ్లుగా సారిక ఇంటికి భర్త అనిల్‌ ఆమె వద్దకు రావడం లేదని చెబుతున్నారు. మరోవైపు సారికది ముమ్మాటికే హత్యేనని మహిళా సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. బుధవారం రాజయ్య ఇంటి ఎదుట వారు ఆందోళన చేపట్టారురాజయ్య కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేశారని ఆరోపించారు.