Begin typing your search above and press return to search.

రాజయ్య ఇంట్లో ఆ అర్థరాత్రి ఏం జరిగిందంటే..?

By:  Tupaki Desk   |   7 Nov 2015 4:13 AM GMT
రాజయ్య ఇంట్లో ఆ అర్థరాత్రి ఏం జరిగిందంటే..?
X
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక.. ముగ్గురు మనమలు సజీవ దహనం కావటం తెలిసిందే. అయితే.. జరిగింది హత్యా..? ఆత్మహత్య అన్న విషయంపై స్పష్టత రావటం లేదు. అయితే.. ఈ దుర్ఘటన జరిగిన రాత్రి అసలేం జరిగిందన్న విషయంపై విశ్వసనీయ వర్గాల ప్రకారం కొంత సమాచారం బయటకు వచ్చింది.

ఘటన జరిగిన అర్థరాత్రి రాజయ్య ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజయ్య.. ఎన్నికల ఖర్చుల కోసం రఘునాథ్ పల్లి మండలంలో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పటం. దీనికి కోడలు సారిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తుకు భరోసా ఇవ్వకుండా ఇలా ఆస్తులు అమ్మటం ఏమిటని ఆమె ప్రశ్నించినట్లు చెబుతున్నారు. దీనికి రాజయ్య కలుగజేసుకొని.. ఆమెకు రెవెన్యూ కాలనీలో ఉన్న ఇంటిని కేటాయిస్తానని చెప్పినట్లు తెలిసిందే.

మిగిలిన ఆస్తి విషయంలో కలుగజేసుకోవద్దని చెప్పగా.. మిగిలిన కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఎలాంటి ఆస్తి ఇచ్చేది లేదంటూ వాదనకు దిగినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. లోపల ఏదో గొడవ జరుగుతున్నట్లుగా బయటకు వచ్చిన అరుపులు.. కేకలతో తెలిసిందని పలువురు చెప్పటం గమనార్హం. అరుపులు.. కేకలు తగ్గి పోయిన తర్వాత తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో పొగ రావటం మొదలైందన్నది ఒక అంచనా. పోలీసు అధికారులు సైతం అగ్నిప్రమాద ఘటన తెల్లవారు జామున నాలుగు గంటల తర్వాతే చోటు చేసుకుందని అంచనా వేస్తున్నారు.

ఇక.. ఈ ఘోర ఘటన జరగటానికి ఒక రోజు ముందు రాజయ్య కొడుకు అనిల్.. అతని భార్య సారిక మధ్య కోర్టులో వాగ్వాదం జరగటం గమనార్హం. భర్త నుంచి దూరంగా ఉంటున్న సారిక.. భర్త నుంచి తనకు జీవనభృతి ఇప్పించాలని గృహహింస చట్టం ప్రకారం గత ఏడాది కోర్టులో కేసు దాఖలు చేయటం.. దీనిపై విచారించిన కోర్టు.. సారికకు నెలకు రూ.6వేలు.. ముగ్గురు పిల్లల పోషణ కోసం ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.15వేలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.

ఈ ఏడాది మొదట్లో (జనవరి) జీవనభృతిపై కోర్టు ఆదేశాలు ఇవ్వగా ఇప్పటివరకూ ఇవ్వాల్సిన మొత్తంలో కేవలం రూ.45 వేలు మాత్రమే చెల్లించటం గమనార్హం. రూ.1.05లక్షలు బకాయిలు పడ్డారు. సజీవ దహనం చోటు చేసుకోవటానికి ఒక రోజు ముందు.. కోర్టులో దంపతులు ఇద్దరూ గొడవ పడ్డారు. అనంతరం అనుమానాస్పద రీతిలో మరణించటం గమనార్హం.