Begin typing your search above and press return to search.

10 నిమిషాల్లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం.. ఏం చెప్పినట్లు?

By:  Tupaki Desk   |   9 Aug 2022 12:30 AM GMT
10 నిమిషాల్లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం.. ఏం చెప్పినట్లు?
X
మేం ఇక్కడ స్పీకర్ నిర్ణయం మీదనో.. స్పీకర్ కున్న అధికారాల గురించో మాట్లాడటం లేదు. కీలక నిర్ణయాన్ని తీసుకునే విషయంలో గంటల కొద్దీ ఆలోచిస్తూ.. తర్జనభర్జల తర్వాత.. నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత రాజీనామా లేఖ మీద ఆమోదముద్ర వేయటం చూస్తుంటాం.

తాజాగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని చూస్తే..స్పీకర్ పోచారం చేతికి రాజీనామా పత్రాన్ని ఇవ్వటం.. తిరిగి వచ్చే పది నిమిషాలకు కూడా కాకుండానే రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓకే చేస్తున్నట్లుగా నిర్ణయాన్ని తీసుకోవటం కొత్త చర్చకు తెర తీస్తోంది.

అందులో మొదటిది ఇంత స్వల్ప వ్యవధిలో రాజీనామాను ఓకే చేయటమా? సాధారణంగా కొన్ని సున్నిత అంశాలకు సంబంధించి వచ్చే రాజీనామాల్ని తొందరపాటుతో అంగీకరించకుండా పరిస్థితుల్ని మదింపు చేసిన తర్వాతే రాజీనామాకు ఓకే చెబుతుంటారు.

కానీ..రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ లో స్పీకర్ అంత త్వరగా ఓకే చెప్పేశారంటే.. దానికి సంబంధించిన అంశంపై ఆయనకు పూర్తి అవగాహనతో పాటు.. ఆయనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం అయి ఉంటుందని చెబుతున్నారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల వ్యవధిలో స్పీకరర్ ఆమోదించటంతో టీఆర్ఎస్ లో కొత్త సందడి వినిపిస్తోంది. స్పీకర్ నిర్ణయాన్ని చూస్తేనే.. ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ పక్కా ప్లాన్ తో.. మాంచి దూకుడుగా ఉన్నట్లుగా అనిపించటం కోసమే రాజీనామాపై యుద్ధ ప్రాతిపదికన ఓకే చేసి ఉంటారంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల వేళ.. ఏదో రకంగా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న తపనతో కేసీఆర్ అండ్ కో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసేలా ఉండాలన్న ఆలోచనతోనే ఎక్కువగా నాన పెట్టకుండా విషయాన్ని తేల్చేయాలన్న ఆలోచనతోనే రాజీనామాకు ఓకే చెప్పించి ఉంటారంటున్నారు. ఏమైనా.. పది నిమిషాల్లో రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందటం.. ఎవరికి అనుకూలంగా సాగుతుందన్న విషయం కాలమే సరైన సమాధానం చెప్పగలదు.