Begin typing your search above and press return to search.

హైదరాబాద్ థియేటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్!

By:  Tupaki Desk   |   19 Oct 2016 10:31 AM GMT
హైదరాబాద్ థియేటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్!
X
ఉరీ ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాల్లో అత్యంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవారిలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఒకరు. దానికి ఆయన వాక్ చాతుర్యమే కారణం అనుకోండి, అది వేరే విషయం. అయితే తదనంతర పరిణామాల్లో భాగంగా పాక్ హీరో ఫవాద్ ఖాన్ కూడా నటించిన "ఏ దిల్ హై ముష్కిల్" సినిమాపై భారీస్థాయిలో నిషేధ వార్తలు వస్తున్నాయి. థియేటర్ల యజమానులు ఎవరికి వారే స్వచ్చందం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించారు. తమ తమ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడం లేదని సూటిగా చెప్పేశారు. అయితే ఆ హీట్ ప్రస్తుతం హైదరాబాద్ కూ పాకింది. ఈ విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే హైదరాబాద్ లోని థియేటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.

హైద‌రాబాద్‌లో "ఏ దిల్ హై ముష్కిల్" మూవీని ప్ర‌ద‌ర్శించేందుకు గోషామ‌హ‌ల్‌ లోని సంతోష్ - స్వ‌ప్న థియేటర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ విషయాలపై సీరియస్ గా స్పందించిన గోషామహ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్... ఈ సినిమా ప్రదర్శనపై భారీ స్థాయిలో ఫైరైయ్యారు. ఇది పాకిస్థాన్ నటుడు నటించిన సినిమా అని.. ఈ సినిమాను హైదరాబాద్ లో, అదీ తన నియోజకవర్గంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రదర్శించడానికి వీల్లేదని హెచ్చరించారు. అక్కడితో ఆగితే ఇక తన గొప్పతనం ఏముంది అనుకున్నారో ఏమో కానీ... త‌న మాట‌ను ఖాత‌రు చేయ‌కుండా ఆయా థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తే పెట్రోలు పోసి థియేట‌ర్‌ ను త‌గ‌ల బెట్టేస్తాన‌ని హెచ్చ‌రించారు. దీంతో ఈ వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై ఈయన ఇస్తోన్న క్లారిటీ ఏమిటంటే... ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే - కరణ్ జోహార్ ఇచ్చే రెమ్యూనరేషన్ తో ఫవాద్ ఖాన్ పాకిస్థాన్ లో ట్యాక్సులు కడతాడని - ఆ టాక్సులు పాక్ ప్రభుత్వానికి చేరుతుందని, ఆ డబ్బును వారు ఐఎస్ ఐకి ఇస్తారని, వాళ్లేమో వాటితో బాంబులు - తుపాకులు తయారుచేసి తీవ్రవాదులను భారత సైనికులను హతమార్చడానికి ఉపయోగిస్తారని చెబుతున్నారు.

కాబట్టి ఈ లాజిక్ కు - తన హెచ్చరికకు లోబడి ఈ సినిమాను హైద‌రాబాద్‌ లో ముఖ్యంగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని థియేటర్లలో ప్రదర్శించరాదని తనదైన మార్కు హుకుం జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారమే లేచినా రాజాసింగ్ వీటిని ఏమాత్రం ప‌ట్టించుకోవడం లేదనే తెలుస్తోంది. అయితే సినిమా విడుదల సమయానికి ఏమి జరగబోతోందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే స‌మ‌యంలో చైనా మేడ్ టపాసుల మీద కూడా స్పందించిన రాజా సింగ్... భార‌త ప్ర‌జ‌లు చైనా టపాసులు కొనుగోలు చేయడం ద్వారా వ‌చ్చే డ‌బ్బును - చైనా భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ లో కారిడార్లు కట్టేందుకు - తీవ్రవాదులకు సాయం చేసేందుకు వినియోగిస్తుంద‌దని అన్నారు. ఈ లాజిక్ కు కూడా కట్టుబడి చైనా టపాసులు ఎవరూ కొనొద్దని హెచ్చరించారు. మరి ఈ ఎమ్మెల్యే గారి మాటలు ఎంతవరకూ ప్రజలు వింటారు, థియేటర్ల యజమానులు పాటిస్తారు అనేది వేచి చూడాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/