Begin typing your search above and press return to search.

బండి సంజయ్ పై కామెంట్స్.. స్పందించిన రాజాసింగ్

By:  Tupaki Desk   |   23 Nov 2020 8:20 AM IST
బండి సంజయ్ పై కామెంట్స్.. స్పందించిన రాజాసింగ్
X
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనను మోసం చేశారంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించినట్లుగా చెబుతున్న ఆడియో టేపు ఒకటి వైరల్ అవుతోంది. ట్వీట్ కూడా దుమారం రేపుతోంది. గోషామహల్ పరిధిలో తన వర్గానికి చెందిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని.. త్వరలోనే ఢిల్లీ నాయకత్వానికి దీనిపై ఫిర్యాదు చేస్తానని అన్నట్టుగా ఆ ఆడియోలో ఉంది.

‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున నేను ఒక్కడినే గెలిచా. అది ఇక్కడి కార్యకర్తల వల్లే సాధ్యమైంది. అలాంటి కార్యకర్తల్లో ఇవాళ ఒక్కరికి కూడా నేను టికెట్ ఇప్పించుకోలేకపోయా. చాలా బాధగా ఉంది. ఇక్కడి నాయకులు ఏవిధంగా నాకు అన్యాయం చేస్తున్నారో అధిష్ఠానానికి తొందర్లో లేఖ రాద్దాం అనుకుంటున్నా..’ అని ఆడియోలో ఉంది.

ఈ ఆడియో జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కలకలం రేపింది. బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా బండి సంజయ్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ చేశారు. తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ద్వారా బండి సంజయ్ తీరు సరిగా లేదంటూ గుర్తు తెలియని వ్యక్తులెవరో ఫొటో ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ రాజాసింగ్ తాజాగా ట్వీట్ చేశారు.

బండి సంజయ్ తీరుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం జరుగబోతోందని.. ఆయన్ను తక్షణమే పార్టీ నుంచి తొలగించాలని తాను డిమాండ్ చేసినట్లుగా ట్వీట్ రూపొందించి కొందరు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారని ట్విట్టర్ లో తెలిపారు.

దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న కుట్రని రాజాసింగ్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.