Begin typing your search above and press return to search.

ముంబై వంతెన విషాదం:త‌ప్పు మాది కాదు..వ‌ర్షందే

By:  Tupaki Desk   |   11 Oct 2017 4:22 PM GMT
ముంబై వంతెన విషాదం:త‌ప్పు మాది కాదు..వ‌ర్షందే
X
ముంబైక‌ర్ల‌కు రైల్వే శాఖ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. దేశంలోనే ఎక్కువ శాతంగా న‌గ‌ర ప్ర‌జ‌లు ఆధార‌ప‌డిన‌ మెట్రో రైల్ వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉన్న న‌గ‌రంగా పేరు పొందిన ముంబైలో స‌దుపాయాల విష‌యంలో ఇప్ప‌టికీ మెరుగుప‌ర్చ‌ని రైల్వే...తాజాగా ఇంకో అవాక్క‌య్యే విష‌యాన్ని సెల‌విచ్చింది. సెప్టెంబర్ 29న ముంబైలోని ఎల్ఫిన్‌ స్టోన్ రైల్వేస్టేషన్ బ్రిడ్జిపై తొక్కిసలాట జరిగి 23 మంది చనిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాద ఘటనపై విచారణ జరిపిన రైల్వేస్ ప్యానెల్.. నెపాన్ని వర్షం మీదికి నెట్టేసింది. అంతేకాదు రద్దీగా ఉండే సమయాల్లో భారీ లగేజీ తీసుకురావద్దంటూ ప్రయాణికులకు ఓ సలహా కూడా ఇచ్చింది.

ఎల్ఫిన్‌ స్టోన్ బ్రిడ్జీ ప్ర‌మాద‌ ఘటనలో గాయపడిన 30 మంది ప్రయాణికులను విచారించి ప్యానెల్ నివేదిక సిద్ధం చేసింది. వెస్టర్న్ రైల్వే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ ప్యానెల్‌ కు హెడ్‌ గా వ్యవహరించారు. సోమవారం ఈ రిపోర్ట్‌ ను వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌ కు ఇచ్చారు. గాయపడినవాళ్లతో మాట్లాడటమే కాకుండా ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న వీడియోలను కూడా ప్యానెల్ పరిశీలించింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రయాణికుంతా బ్రిడ్జిపైకి వెళ్లడానికి ప్రయత్నించడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ప్యానెల్ తేల్చింది! ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం కూడా ప్రమాద తీవ్రతను పెంచిందని చెప్పింది. ఇక భారీ లగేజీతో వచ్చిన కొందరు కిందపడటంతో తొక్కిసలాట మొదలైందని నివేదికలో ప్యానెల్ పేర్కొంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణం కాదని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు వెల్లడించింది. ప్రయాణికులు భారీ లగేజీతో రాకూడదని ప్యానెల్ సూచించింది.

మ‌రోవైపు అక్కడున్న బుకింగ్ ఆఫీస్‌ ను వేరే చోటుకు తరలించాలని - మరో ఓవర్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేయవచ్చని సిఫారసు చేసింది. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో వేగంగా స్పందించడానికి అధికారులు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. మొత్తానికి ఈ ప్రమాదంలో రైల్వేల తరఫున ఎలాంటి పొరపాటు జరగలేదని ప్యానెల్ తేల్చింది.