Begin typing your search above and press return to search.

బాబు దీక్ష‌కు ప్ర‌కృతి కూడా నో చెబుతోందా?

By:  Tupaki Desk   |   5 Jun 2018 7:32 AM GMT
బాబు దీక్ష‌కు ప్ర‌కృతి కూడా నో చెబుతోందా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టైం ఏ మాత్రం బాగున్న‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు. ఆయ‌న ఏం చేసినా.. ఎదురు పంచ్ లు ప‌డుతున్నాయి. చేసిన త‌ప్పుల‌కు ఫ‌లితం అనుభ‌వించాల‌న్న‌ట్లుగా ప్ర‌స్తుత ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయ‌ని చెప్పాలి. కేంద్రంలోని మోడీ స‌ర్కారుతో నాలుగేళ్ల పాటు అంట‌కాగి.. ఏపీకి ఏ మాత్రం లాభం చేయ‌ని వేళ‌.. మోడీతో ఉంటే తాను మునిగిపోతాన‌న్న ఉద్దేశంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన బాబు.. అదే ప‌నిగా కేంద్రాన్ని విమ‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఏపీ ప్ర‌త్యేక హోదాను.. మోడీ బూచిని చూపించి 2019 ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కుతామ‌ని భావిస్తున్న చంద్ర‌బాబు.. పాల‌న వ‌దిలేసి.. అదే ప‌నిగా స‌భ‌లు నిర్వ‌హిస్తున్న వైనం తెలిసిందే. ఇప్ప‌టికే లోటు బ‌డ్జెట్‌ తో విల‌విల‌లాడుతున్న రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై మ‌రింత భారం మోపేలా దీక్ష‌ల పేరుతో ఆయ‌న చేస్తున్న విన్యాసాలు ప్ర‌జ‌లు త‌ప్పు ప‌డుతున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే.. ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు.. ప్ర‌కృతి సైతం బాబును రిజెక్ట్ చేస్తుందా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఈ మ‌ధ్య‌న నిర్వ‌హించిన ప‌లు స‌భ‌ల్లో ఈదురు గాలుల‌తో ఇక్క‌ట్లు ప‌డిన త‌మ్ముళ్ల బ్యాచ్ కి.. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్వ‌హించిన దీక్షలోనూ ఊహించ‌ని షాక్ త‌గిలింది.

అయితే.. ఈ షాక్ ప్ర‌కృతి నుంచి రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మ‌ధ్య‌నే తిరుప‌తిలో నిర్వ‌హించిన స‌భ‌కు ముందు పెద్ద ఎత్తున గాలులు వీసి.. స‌భ ఏర్పాట్ల‌ను చింద‌ర‌వంద‌ర చేయ‌టం తెలిసిందే. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిర్వ‌హించిన న‌వ నిర్మాణ దీక్షను చేప‌ట్టిన బాబుకు ప్ర‌కృతి నుంచి స‌హకారం అంద‌లేదు. దీక్ష సంద‌ర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బాబు స్పీచ్ స్టార్ట్ చేశారు. జ‌గ‌న్ మొద‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌కూ అంద‌రిపైనా విమ‌ర్శ‌లు చేశారు. అదే స‌మ‌యంలో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారింది.

చీక‌ట్లు క‌మ్మేశాయి. పెద్ద ఎత్తున ఈదురు గాలులు.. దీంతో.. ముంద‌స్తు జాగ్ర‌త్త కోసం విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. వేదిక‌కు వేసిన కొన్ని రేకులు గాలి దెబ్బ‌కు ఎగిరిపోయాయి. అదే స‌మ‌యంలో మొద‌లైన భారీ వ‌ర్షానికి.. దీక్ష‌కు హాజ‌రైన వారంతా తీవ్ర అవ‌స్థ‌ల‌కు గుర‌య్యారు. ప్ర‌కృతి తీరు ఒక్క‌సారిగా మారిపోవ‌టంతో దీక్ష‌కు హాజ‌రైన వారికి ఏం చేయాలో తోచ‌లేదు. బిక్కుబిక్కు మంటూ గ‌డిపారు. క‌రెంటు పోయిన వేళ‌.. అధికారులు గొడుగులు ప‌ట్టుకోవ‌టంతో.. వాటి చెంత‌నే ద‌ర్జాగా కూర్చున్నారు చంద్ర‌బాబు. ఇంత జ‌రుగుతున్నా.. హ‌డావుడి తప్ప‌ద‌న్న‌ట్లుగా కొంద‌రు విన‌తి ప‌త్రాలు ఇవ్వ‌టం.. వాటిని సెల్ వెలుతురులో బాబు ప‌రిశీలించిన వైనం చూసిన‌ప్పుడు బాబులో ఈ నాట‌కీయ‌త ఎప్పుడు త‌గ్గుతుందా? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. ఏమైనా.. బాబు నిర్వ‌హిస్తున్న స‌భా స్థ‌లి వ‌ద్ద ప్ర‌కృతి రియాక్ట్ అవుతున్న తీరును ప‌లువురు ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం. బాబుకు ప్ర‌జ‌లే కాదు ప్ర‌కృతి కూడా స‌హ‌క‌రించ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.