Begin typing your search above and press return to search.

ముసురు పట్టింది.. రాష్ట్రాల్లో కరువు పోయేనా?

By:  Tupaki Desk   |   12 Aug 2015 6:31 AM GMT
ముసురు పట్టింది.. రాష్ట్రాల్లో కరువు పోయేనా?
X
జూన్ లో మొదలు కావాల్సిన వర్షాలు.. ఇప్పటివరకూ అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి. అక్కడక్కడా ఒకట్రెండు వానలు కురిసినా.. నేల తడిచిందే తప్పించి మరెలాంటి లాభం లేదు.

ముందుగా వచ్చేసిన వానల్ని చూసిన చాలామంది రైతులు.. నాటేశారు. ముందు ఊరించిన వర్షం.. తర్వాత ఊసురుమనిపించటం.. వర్షం జాడ లేకపోవటం.. ఎండ తీవ్రత పెరగటంతో కరవు కోరలు కనపడుతున్న పరిస్థితి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం జాడ లేకపోవటంతో పైరుకు నీళ్లు పెట్టలేక పశువులకు మేతకు వదిలేస్తున్నారు.

మరోవైపు.. జలాశయాల్లోనీటి మట్టం పడిపోయిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి ముసురు పట్టిన పరిస్థితి. వాయువ్య.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

ఉత్తర కోస్తా.. ఒడిశా తీరాలను అనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో కోస్తాలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అదే సమయంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలుతున్న కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఆకాశం ముసురేసింది. రానున్న ఐదురోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని అంచాన వేస్తున్నారు.

ఒకవైపు అల్పపీడనం.. మరోవైపు నైరుతి.. ఈ రెండింటి పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలుకురిస్తే.. కరవు పోయి కళకళలాడితే అంతకు మించి కావాల్సిందేముంది. ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నతో పాటు.. వాడిపోయిన జలాశయాలు సైతం.. నీరు రావాలే కానీ.. తమలో ఇముడ్చుకుందామన్న ఆశగా ఉన్న సమయంలో.. వరుణుడు కరుణిస్తే.. అంతకు మించి కావాల్సిందేముంది..?