Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ.. రైల్వే శాఖ ఆ పని చేసిందా?

By:  Tupaki Desk   |   6 Oct 2020 4:15 AM GMT
లాక్ డౌన్ వేళ.. రైల్వే శాఖ ఆ పని చేసిందా?
X
కాజీపేట - విజయవాడ రైలు మార్గంలో దూరం 350 కిలోమీటర్లు. సాధారణంగా ఈ రెండు స్టేషన్ల మధ్య దూరాన్ని సాధారణ ట్రైన్లు మూడున్నర గంటలు తీసుకుంటే.. ఎక్స్ ప్రెస్ రైళ్లు మరింత త్వరగా గమ్యస్థానానికి చేరుకుంటాయి. నాన్ స్టాప్ రైళ్లు మరికాస్త ముందుగా చేరుకుంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల వేగం గంటకు సగటున 110 కిలోమీటర్లు మాత్రమే.
అందుకు భిన్నంగా తాజాగా చేసిన మార్పులతో గంటకు 135 కి.మీ. వేగంతో కేవలం మూడున్నర గంటల వ్యవధిలో ప్రయాణించే సౌలభ్యం రైలు ప్రయాణికులకు దక్కనుంది. అదెలా సాధ్యమైంది? ఇంత వేగంగా రైళ్లను నడిపేందుకు రైలు పట్టాల సామర్థ్యం సహకరిస్తుందా? అన్నది ప్రశ్న. అయితే.. తాజాగా చోటు చేసుకున్న మార్పులతో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. అదెలానంటే..

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్.. రైల్వేలకు సైతం వర్తించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రయాణికుల రైళ్లను పూర్తిగా నిలిపివేయగా.. గూడ్స్ రైళ్లను మాత్రమే నడిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రైల్వే శాఖ.. పలు రూట్లలో పాత పట్టాల స్థానే.. కొత్త పట్టాల్ని ఏర్పాటు చేశారు. దీంతో.. సామర్థ్యం పెరిగి.. మరింత వేగంగా రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా రైలు పట్టాలు తయారయ్యాయి.

కొత్తగా ఏర్పాటు చేసిన పట్టాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు వీలుగా తాజాగా టెస్ట్ రన్ నిర్వహించారు. 24 బోగీలతో ప్రయాణించిన రైలు.. గంటకు గరిష్ఠంగా 135 కి.మీ. వేగంతో ప్రయాణించింది. దీంతో.. సగటు ప్రయాణ సమయానికి దాదాపు గంటన్నర తగ్గిపోయింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణంగా మారింది. ఈ రెండు ప్రధాన స్టేషన్ల మధ్య కొన్ని స్టాపులు ఉండటం.. స్టేషన్ దగ్గరకు రాగానే రైలు వేగాన్ని తగ్గించటం.. పలు స్టాపుల్లో ఆగటం కారణంగా ప్రయాణ సమయం పెరుగుతోంది.

నాన్ స్టాప్ రైళ్లు.. సూపర్ ఫాస్టు రైళ్లు వేగంగా ప్రయాణించే అవకాశం ఉన్నా.. పట్టాల సామర్థ్యం మీద సందేహాలతో నడిపేవారు కాదు. కొత్త ట్రాకుల్ని ఏర్పాటు చేసి.. తాజాగా నిర్వహించిన టెస్టు రన్ సక్సెస్ కావటంతో.. సూపర్ ఫాస్టు రైళ్లు.. నాన్ స్టాప్ రైళ్ల వేగాన్ని ఈ మార్గంలో మరింత పెంచే వీలుందని చెబుతున్నారు. దీంతో.. రైల్వే ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని తగ్గించుకునే వీలుంది. దేశాన్ని.. దేశ ప్రజల్ని లాక్ డౌన్ దెబ్బేసినట్లు అనుకుంటాం కానీ.. ఇలాంటి విన్నప్పుడు లాక్ డౌన్ కారణంగా కొన్ని మేళ్లు కూడా జరిగాయని చెప్పక తప్పదు.